అటవీప్రాంతంలో విత్తనాలు చల్లిన విద్యార్థులు
✍️ కొత్తగూడెం – దివిటీ (జులై 14)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జి.వి. పాటిల్ మార్గదర్శనంలో చేపట్టిన, ప్రకృతి పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా రామవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు తాము సేకరించిన విత్తనాలను సోమవారం గరీబ్ పేట రిజర్వ్ అటవీప్రాంతంలో జల్లారు. పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులను భాగస్వాములుగా తీర్చిదిద్దే లక్ష్యంతో, ఇటీవల జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విత్తనాల సేకరణపై ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా రామవరం ఉన్నత పాఠశాల విద్యార్థులు స్థానికంగా సేకరించిన పలు రకాల్లో టేకు, చింత, కానుగ, వేప, పనస విత్తనాలను ప్రత్యేకంగా ఎంపికచేసి మరీ వాటిని అటవీప్రాంతంలో చల్లారు. ఈ వర్షాకాలం అనుకూలంగా భావించి, విత్తనాల అభివృద్ధికి సహాయకంగా ఉండే ప్రదేశాలను అటవీశాఖ సిబ్బంది సహకారంతో గుర్తించి, అక్కడ చల్లినట్లు రామవరం ఉన్నత పాఠశాల హెచ్ఎం డాక్టర్ ప్రభుదయాల్ ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో ఆ పాఠశాల ఉపాధ్యాయులు నరేష్ బాబు, శంకర్, ఇతర సిబ్బందితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.