గేదె, ఆవు పాల కంటే మేక పాలు శ్రేష్టం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జి.వి. పాటిల్
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జులై 14)
గేదె, ఆవు పాల కంటే మేకపాలు ఎంతో శ్రేష్టమైనవని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ చెప్పారు. సోమవారం కొత్తగూడెం ఫుడ్ కోర్టులోని మహిళాశక్తి క్యాంటీన్లో మేకపాల విక్రయ స్టాల్ ను కలెక్టర్ సందర్శించారు. ఆయన మహిళాశక్తి క్యాంటీన్లో విక్రయిస్తున్న ఆహార పదార్థాల వివరాలనడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. వారిచ్చిన మేకపాలు తాగిన కలెక్టర్, పాఠశాలకు వెళ్లే పిల్లలకు తప్పనిసరిగా ఎంతో శ్రేష్టమైన, స్వచ్ఛమైన మేకపాలు తాగించాలన్నారు. జిల్లావ్యాప్తంగా రెండు లక్షల మేకలున్నాయని, మార్కెట్లో గేదె, ఆవు పాలు ప్రస్తుతం లీటర్ రూ.80దాకా ధర ఉందని, అదే ధరకు మేకపాలు కూడా విక్రయించవచ్చని తెలిపారు. జిల్లాలో రైతులు ముందడుగు వేసి లీటర్ నుంచి ప్రారంభించినప్పటికీ నెలకు రూ.3 వేల నుంచి రూ.4 వేలు అదనపు ఆదాయం కూడా లభిస్తుందన్నారు. ఈ మేకపాల విక్రయాల్లో జిల్లాలో ఏడాదికి రూ.50 కోట్ల వ్యాపారానికి అవకాశం ఉందన్నారు. జిల్లా మేకల పెంపకానికి, పశుగ్రాసానికి అనువైనదన్నారు. నగర ప్రాంతాల్లో మేకపాలతో పన్నీరు, చీజ్ వంటివి తయారుచేసి విక్రయించడంతో ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రాంతంలో కూడా అలా చేయడం ద్వారా ఆర్థికాభివృద్ధి చెందవచ్చని, రైతులు ఈ దిశగా అడుగులు వేయాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశువైద్యాధికారి డాక్టర్.వెంకటేశ్వర్లు, పశువుల డాక్టర్లు ఆనందరావు, బాలకృష్ణ, రామకృష్ణ, సంతోష్, గోపాలమిత్ర సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.