పసిబిడ్డలకు ప్రాణసంకటంగా ‘కుళ్లిన గుడ్లు’…
బూర్గంపాడు ఐసీడీఎస్ ప్రాజెక్టులో కలకలం
✍️ బూర్గంపాడు – దివిటీ (జులై 13)
పసిబిడ్డల ప్రాణాలకు ‘పౌష్టికాహారమే పెనుముప్పు’గా మారింది… ఆరోగ్యంగా ఎదిగేందుకు అందిస్తున్న ఆహారమే దానికి కారణమవుతోంది… చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదల కోసం పని చేస్తున్న అధికారిక వ్యవస్థలో కొందరి నిర్లక్ష్యం ఈ పరిస్థితులకు దారితీస్తోంది.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు ఐసీడీఎస్ ప్రాజెక్టులో ‘కుళ్లిన కోడిగుడ్లు’ కలకలం సృష్టిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు పరిధిలోని సారపాక గాంధీనగర్ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల కోసం సిబ్బంది పంపిణీ చేసిన కోడిగుడ్లు కుళ్లి పోయిన పరిస్థితిలో తమ పిల్లలకు ప్రమాదకరంగా మారాయని తల్లులు ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీలో పంపిణీ చేసిన కోడిగుడ్లు ఉడికించి తమ చిన్నారులకు తినిపించే క్రమంలో కుళ్లిపోయి తీవ్ర దుర్వాసన వస్తుండటంతో భయమేస్తోందని వారు వాపోతున్నారు. బూర్గంపాడు ఐసీడీఎస్ ప్రాజెక్టులోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో ఇదే దుస్థితి నెలకొందని సమాచారం. ఈ అంగన్వాడీ కేంద్రాలకు నెలకు మూడు విడతలుగా సరఫరా చేయాల్సిన కోడి గుడ్లను రవాణా ఖర్చులు తగ్గించుకోవాలనే అత్యాశకు పోయి ఒకే విడత ‘డంప్ చేస్తున్నారనే’ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కారణం వల్లనే కోడి గుడ్లు అంగన్వాడీ కేంద్రాల్లో ఎక్కువ రోజులు నిల్వ ఉండి ఇలా కుళ్లిపోతున్నాయని తెలుస్తోంది. గుడ్ల సరఫరాలో లోపాలకు కొందరు అంగన్వాడీ సిబ్బంది కూడా తమవంతు సహకారం అందిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితులను నివారించి అంగన్వాడీ కేంద్రాలకు మంచి ఆహార పదార్థాలు సరఫరా జరిగేవిధంగా పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు కూడా ఎందుకనో నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. ఈ లోపాల విషయంలో ఉన్నతాధికారులు స్పందించి దిద్దుబాటు చర్యలు తీసుకుని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం సక్రమంగా అందించేలా చూడాలని పోషకాహార నిపుణులు, సామాజికవేత్తలు సూచిస్తున్నారు.