Divitimedia
Bhadradri KothagudemBusinessCrime NewsHealthLife StyleSpecial ArticlesTelanganaYouth

కరవైణ రక్షణ… పనిలో పర్యావరణ భక్షణ

కరవైణ రక్షణ… పనిలో పర్యావరణ భక్షణ

విద్యుత్తులైను నిర్మాణపనుల్లో తీవ్ర నిర్లక్ష్యం

కఠినచర్యలు తీసుకుంటామన్న డీఈ నందయ్య

✍️ బూర్గంపాడు – దివిటీ (జూన్ 17)

డబ్బులెక్కువ మిగిలించుకోవాలనే ఆశ, ఎవరేం చేస్తారులే? అనే ధీమా… వెరసి ప్రమాదకరమైన పరిస్థితులలో పనులు చేస్తున్న కార్మికులకు పొంచి ఉన్న ప్రాణ గండం… ఇవీ బూర్గంపాడు మండలంలో జరుగుతున్న విద్యుత్తులైను నిర్మాణంలో ప్రస్తుతానికి చెప్పుకోదగిన విశేషాలు… ఆ పనులపై స్థానికులు మొత్తుకుంటున్నా తన పని తనదేననే రీతిలో కాంట్రాక్టర్లు తీవ్ర నిర్లక్ష్యంతో ముందుకు సాగుతున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. సారపాక నుంచి మండల కేంద్రమైన బూర్గంపాడు వరకు విద్యుత్తు సరఫరా వ్యవస్థలో చేసే ఆధునికీకరణకోసం 6.5కిలోమీటర్ల మేర దాదాపు రూ.50లక్షల అంచనా వ్యయం తో చేస్తున్న ఈ పనుల తీరు పట్ల పలు అభ్యంతరాలున్నాయి. పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు ఆ కార్మికులకు కనీస రక్షణ కల్పించడం లేదు. చేతులకు గ్లౌజులతో మొదలుపెట్టి సేఫ్టీ బెల్ట్, స్కఫ్ హోల్డర్స్, రేడియం కోట్స్, హెల్మెట్, వంటి ఏ ఒక్క రక్షణ పరికరంతో కార్మికులు కనిపించడం లేదు. అసలు ఇలాంటి కొన్ని పరికరాలు రక్షణ కోసం వాడాలనేది కూడా అక్కడి కార్మికులకు తెలిసినట్లులేదు. వచ్చామా, చెప్పిన పనులు చేస్తున్నామా అన్నదే ఆ కార్మికులు పాటిస్తున్నట్టున్నారు. ఇంకొక వైపు ఈ విద్యుత్తులైను నిర్మాణం కోసం అడ్డం వస్తున్నాయనే సాకుతో అవసరం ఉన్నవి, లేనివి కూడా చెట్లు ఇష్టారీతిన నరికేస్తున్నారు. అసలు ఈ పనుల దగ్గర బాధ్యత కలిగిన పర్యవేక్షణ కూడా లేదు. ఈ పనుల్లో సాగుతున్న వ్యవహారాలపై కొందరు స్థానికులు తమకు తెలిసినంత మేరకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా సంబంధిత కాంట్రాక్టర్లు గానీ అధికారులు గానీ పట్టించుకున్న దాఖలాలే లేవు. ఈ పనులు జరుగుతున్న తీరు, పాటిస్తున్న లోపభూయిష్ట వ్యవహారాలపై ‘దివిటీ మీడియా’కు పలువురు స్థానికులు తమ తమ అవగాహన మేరకు సమాచారం అందిస్తుండటంతో పరిశీలించగా పనుల్లో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యధోరణి కనిపించింది. ఈ అంశాలపై ‘దివిటీ మీడియా’ ఫోన్ ద్వారా ఎన్పీడీసీఎల్ డీఈ (కన్స్ట్రక్షన్స్) నందయ్యను సంప్రదించగా, నిబంధనల మేరకు పనులు చేయాలని కాంట్రాక్టర్లకు స్పష్టంగా ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో నిబంధనల ఉల్లంఘన పట్ల కఠినచర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఏంచేస్తారో వేచి చూడాలి మరి…

Related posts

బూర్గంపాడు పోలీస్ స్టేషన్ సందర్శించిన ఎస్పీ

Divitimedia

లొంగిపోయిన మావోయిస్టు బెటాలియన్ దళసభ్యుడు

Divitimedia

అతని కన్నుపడితే బంగారం మాయమేనా…

Divitimedia

Leave a Comment