Divitimedia
Bhadradri KothagudemBusinessHyderabadLife StylePoliticsSpot NewsTelangana

శ్రమశక్తి అవార్డు అందుకున్న ఐటీసీ కార్మిక నాయకుడు రామారావు

శ్రమశక్తి అవార్డు అందుకున్న ఐటీసీ కార్మిక నాయకుడు రామారావు

✍️ హైదరాబాద్, సారపాక – దివిటీ (మే 1)

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మేడే’ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే ‘శ్రమశక్తి’ అవార్డును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలోని ఐటీసీ పీఎస్పీడీ కార్మిక నాయకుడు గోనె రామారావు అందుకున్నారు. ఈ మేరకు గురువారం హైదరాబాదులోని రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కార్మిక, శిక్షణ, ఉపాధి కల్పన శాఖల కమిషనర్ దానకిశోర్ చేతుల మీదుగా ‘శ్రమశక్తి అవార్డు’ను రామారావుకు ప్రదానం చేశారు. కార్మిక నాయకుడిగా ఆయన అందిస్తున్న సేవల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డు ప్రదానం చేసి సత్కరించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని ప్రముఖ పేపర్ పరిశ్రమ ఐటీసీ పీఎస్పీడీలో ఐ.ఎన్.టి.యు.సి అధ్యక్షుడిగా గోనె రామారావు పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎంఎస్సీ, ఎంఏ బీఈడీ విద్యార్హత కలిగిన ఆయన కొంతకాలం ప్రైవేటు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 2001లో ఐటీసీ పీఎస్పీడీ పరిశ్రమలో కాంట్రాక్ట్ సూపర్వైజరుగా చేరిన రామారావు 2006లో పర్మినెంట్ కార్మికుడిగా ఎంపికయ్యారు. అప్పటి నుంచి స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ కార్యవర్గసభ్యుడిగా పదేళ్లపాటు పనిచేశారు. 2016లో అప్పటి రికగ్నైజ్డ్ యూనియన్ (గుర్తింపు కార్మికసంఘం) జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టి 2018లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2022వరకు ఆ గుర్తింపు కార్మికసంఘం అధ్యక్షుడిగా కార్మిక సంక్షేమానికి కృషి చేశారు. ప్రధానంగా కోవిడ్ సమయంలో కార్మిక నాయకుడిగా కీలకమైన ‘కోవిడ్ పాలసీ’ అమలు కోసం కృషి చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడి స్థానంలో కార్మిక సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం ‘శ్రమశక్తి’అవార్డు అందించింది. ఈ సందర్భంగా రామారావు, ‘దివిటీ’తో మాట్లాడుతూ,ఈ అవార్డు అందుకోవడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో కార్మిక సమస్యల పరిష్కారం కోసం తాను మరింత ముందుంటానని, తన సేవలు ఐటీసీ కార్మికులకే అంకితం చేస్తానని వివరించారు. తనను గుర్తించి ఈ అవార్డు ప్రదానం చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానన్నారు. ఈ అవార్డు ప్రదానోత్సవంలో రాష్ట్ర కనీస వేతనాల సలహామండలి చైర్మన్ జనక్ ప్రసాద్, సలహామండలి సభ్యులు ఐటీసీ పీఎస్పీడీ ఐ.ఎన్.టి.యు.సి ప్రధాన కార్యదర్శి యారం పిచ్చిరెడ్డి, సీనియర్ కార్మిక నాయకులు మారం వెంకటేశ్వర రెడ్డి, గోనె దారుగా, నాయకుడు షేక్ అబ్దుల్ సలీం, తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఆహ్వానించేందుకు వచ్చానన్న కేఏ పాల్, అనుమతి లేదన్న పోలీసులు

Diviti Media News

ముక్కోటి మహోత్సవాల్లో బాధ్యతగా విధులు నిర్వర్తించాలి

Divitimedia

పాఠశాలల పునఃప్రారంభానికి అన్ని సౌకర్యాలు కల్పించాలి

Divitimedia

Leave a Comment