Divitimedia
Bhadradri KothagudemEducationHealthKhammamLife StyleSpot NewsTelanganaYouth

టెన్త్ విద్యార్థులకు సదుపాయాలపై పీఓ ఆదేశాలు

టెన్త్ విద్యార్థులకు సదుపాయాలపై పీఓ ఆదేశాలు

✍️ భద్రాచలం – దివిటీ (జనవరి 3)

గిరిజన సంక్షేమశాఖ విద్యాలయాల్లో 10వ తరగతి విద్యార్థులకు మంచి విద్య బోధనలతోపాటు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్పెషలాఫీసర్లు, పాఠశాలల హెచ్ఎంలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆదేశించారు. ఐటీడీఏ మీటింగ్ హాలులో శుక్రవారం స్పెషలాఫీసర్లు, హెచ్ఎంలు, వార్డెన్లతో పర్యవేక్షణ, నిర్వహణ తీరుపై ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాలల్లో చిన్న రిపేర్లు ఏమైనా ఉంటే ప్రత్యేకాధికారులు, హెచ్ఎంలు కలిసి సమన్వయంతో చేయించుకోవాలన్నారు. ముఖ్యంగా పిల్లలకు మంచినీరు, రోజు వారీ వాడకపు నీరు, వాష్ రూమ్ లకు డోర్లు, బాలికల ఆశ్రమ పాఠశాలలకు తప్పనిసరిగా కాంపౌండ్ వాల్, డార్మెటరీ లేని చోట డార్మెటరీ రూముల నిర్మాణం, కోతుల బెడద ఉన్న పాఠశాలల్లో తప్పని సరిగా మెష్ ఏర్పాటు, డైనింగ్ హాల్ లేని చోట ఓపెన్ ప్లేస్ లో ఫ్రీ డైనింగ్ హాల్ వంటి పనులు చేయించుకోవాలన్నారు. డ్రైనేజీ సమస్య,వర్షాకాలంలో నీటిచెమ్మ వచ్చే పాఠశాలల్లో వేసవికాలంలో రిపేర్లు చేయిస్తామన్నారు. పాఠశాల పర్యవేక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఐఏఎస్ ఆఫీసర్లను నియమించినందున స్పెషల్ ఆఫీసర్లు, హెచ్ఎంలు కేటాయించిన ఆ పాఠశాలలను తప్పనిసరిగా వారానికి రెండుసార్లు ఉదయం సాయంత్రం తనిఖీ చేయాలన్నారు. విద్యకు సంబంధించిన నైపుణ్యాలు గమనించి,10వ తరగతిలో తప్పనిసరిగా పాసయ్యేలా విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. ఉద్దీపకం వర్క్ బుక్ నిర్వహణ తప్పక కొనసాగించాలని, గ్రాఫ్, నోట్ బుక్స్, జామెట్రీ బాక్స్, ఇతర కాస్మోటిక్స్ సకాలంలో అందించాలని కోరారు. విద్యార్థుల ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరైనా పిల్లలు అనారోగ్యానికి గురైతే వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేసి వైద్య పరీక్షలు చేయించాలని, సీరియస్ గా ఎవరైనా ఉంటే వారికి తప్పనిసరిగా జిల్లా కేంద్రం ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించాలన్నారు. ఈ విషయం తప్పని సరిగా తల్లిదండ్రులకు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని రావాలన్నారు. ప్రతి పాఠశాలలో కొత్త టైంటేబుల్ ప్రకారమే తరగతులు, స్టడీ అవర్స్ తప్పనిసరిగా నిర్వహించాలని, సంక్రాంతి సెలవులకు పిల్లలు వారి సొంత గ్రామాలకు వెళితే, సెలవులు కాగానే వెంటనే పాఠశాలకు వచ్చేలా తల్లిదండ్రులకు తెలపాలని పీఓ ఆదేశించారు. పాఠశాలల్లో ఏవైనా రిపేర్లు చేయిస్తే, చేయించే ముందు, చేయించిన తర్వాత ఫొటోలు తీయించి, వెంటనే ఆ బిల్లులు పంపించాలని అన్నారు. వసతి గృహాల్లో చదివే పిల్లలకు హిందీ, ఇతర సబ్జెక్టులు బోధించే ప్రైవేట్ ట్యూటర్స్ ను ఏర్పాటు చేసుకోవాలని, చదువులో వెనకబడిన పిల్లల పట్ల సబ్జెక్ట్ టీచర్లు హెచ్ఎంలు బాధ్యత తీసుకోవాలన్నారు. పదవతరగతి విద్యార్థుల విద్యాబోధన, పర్యవేక్షణ పట్ల నిర్లక్ష్యం వహించే ప్రత్యేక అధికారులు, హెచ్ఎంలు, సబ్జెక్ట్ టీచర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రానున్న మూడు నెలల్లో తప్పనిసరిగా పాఠశాలల నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, పదవ తరగతిలో పిల్లలు 10/10 ర్యాంక్ తీసుకువచ్చేలా చూడాలన్నారు. జనవరి చివరి వారం నుంచి సైన్స్ ల్యాబ్ నకు సంబంధించిన ఒక వాహనం డిజైన్ చేసి పాఠశాలలకు పంపించి, పిల్లల్లో అవగాహన కలిగించే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నామని పీఓ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనరల్ ఏపీఓ డేవిడ్ రాజ్, ట్రైబల్ వెల్ఫేర్ రెండు జిల్లాల డీడీలు మణెమ్మ, విజయలక్ష్మి, ఏసీఎంఓ రమణయ్య, శ్రీరాములు, ఏటీడీఓలు జహీరుద్దీన్, అశోక్ కుమార్, సత్యవతి, రాధమ్మ, చంద్రమోహన్, ప్రత్యేక అధికారులు, హెచ్ఎంలు, వార్డెన్లు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

బీటీపీఎస్ కాంట్రాక్టర్స్ యూనియన్ ఆఫీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే

Divitimedia

విద్యార్థి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి : పి.డి.ఎస్.యు

Divitimedia

ఎట్టకేలకు రంగంలోకి దిగిన మండల అధికారులు

Divitimedia

Leave a Comment