ఐటీసీలో కార్మికసంఘం ఎన్నికలకు రంగం సిద్ధం
కార్మికసంఘాలతో 10న అధికారుల సమావేశం
✍️ బూర్గంపాడు – దివిటీ (నవంబరు 29)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలోని ప్రముఖ పేపర్ పరిశ్రమ ‘ఐటీసీ – పి.ఎస్.పి.డి’లో తాజాగా గుర్తింపు కార్మికసంఘం ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఎన్నికల ప్రక్రియ, షెడ్యూల్ గురించి చర్చించేందుకు డిసెంబరు 10వ తేదీన ఖమ్మంలో నిర్వహించనున్న సమావేశానికి తగిన వివరాలతో హాజరు కావాలని కోరుతూ, కార్మికశాఖాధికారులు పరిశ్రమలోని రిజిస్టర్డ్ కార్మిక సంఘాలకు శుక్రవారం నోటీసులు పంపించారు. ఈ పరిశ్రమలో ప్రస్తుత కార్మికసంఘం కాల పరిమితి ముగిసినందున తిరిగి ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ, ప్రతిపక్ష ఐఎన్టీయూసీ, మిత్రపక్షాలు రాష్ట్ర కార్మికశాఖ అధికారులకు గత సెప్టెంబరు 17వ తేదీన డిమాండ్ నోటీసు ఇచ్చాయి. ప్రస్తుత గుర్తింపు కార్మిక సంఘం కాలపరిమితి గడిచిన జులై 4వ తేదీ నాటికే ముగియటంతో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని వారు కోరారు. పరిశ్రమలోని ప్రధాన ప్రతిపక్ష కార్మికసంఘం ఐఎన్టీయూసీ, మిత్రపక్షాలు ఎన్నికల ప్రక్రియ నిర్వహణ కోసం లెటర్ ఇవ్వటంతో ఐటీసీ పేపర్ పరిశ్రమలో మళ్లీ గుర్తింపు కార్మికసంఘం ఎన్నికలకు తెరలేచింది. ఇక్కడ కార్మికసంఘం గుర్తింపు ఎన్నికల నిర్వహణకు నిర్ణయం తీసుకున్న కార్మికశాఖ అధికారులు ఆ ప్రక్రియ చేపట్టిన నేపథ్యంలో కార్మికసంఘాల వివరాలు పరిశీలించి, తగు షెడ్యూల్ నిర్ణయించేందుకు ఖమ్మం కలెక్టరేట్ (ఐడీఓసీ) లోని కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో కార్మిక సంఘాల సమావేశం నిర్వహించనున్నారు.
—————————
ఒకసారి వారు… మరొకసారి వీరు… ఆనవాయితీ
—————————
ఐటీసీ పేపర్ పరిశ్రమలో జరిగే ఎన్నికల్లో ఐఎన్టీయూసీ, టీఎన్టీయూసీ మిత్రపక్షాలకు ‘ఒకసారి వారు, మరొక్క సారి వీరు’ అన్నరీతిలో కార్మికులు పట్టంకడుతున్నారు. ప్రస్తుతం 1195మంది కార్మికుల సంఖ్య ఉన్న ఈ ఐటీసీ పరిశ్రమలో రిటైర్మెంట్లు పోగా 1177మంది ఓటుహక్కు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. కార్మికులతోపాటు కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు, సంక్షేమం విషయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన ఈ గుర్తింపు కార్మికసంఘం ఎన్నిక విషయంలో కార్మికుల తీర్పుకోసం కార్మిక సంఘాలన్నీ సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొంతకాలంగా ప్రచారం ఆరంభించిన నేపథ్యంలో అధికారిక ఎన్నికల ప్రక్రియ (వెరిపికేషన్) కూడా ప్రారంభం కావడంతో ఐటీసీలో కోలాహలం పెరుగుతోంది. ఇక్కడ ఈసారి ఎన్నికల్లో ముఖ్యంగా విద్య, వైద్యం, వసతి, రిటైర్మెంట్ బెనిఫిట్స్, తదితరాలు ప్రచారంలో కీలకంగా కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఓటుహక్కు లేకపోయినప్పటికీ ప్రచారంలో కాంట్రాక్ట్ కార్మికుల పాత్ర కూడా కీలకం కానుంది. తమ సంక్షేమం పట్ల కృషిచేస్తున్న సంఘానికి అనుకూలంగా ప్రచారానికి కాంట్రాక్ట్ కార్మికులు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అధికారిక ప్రక్రియ కూడా ఆరంభించడంతో సారపాక, భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ఐటీసీ కార్మిక సంఘం ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది.