ప్రభుత్వ నర్సింగ్ కాలేజీని సందర్శించిన జిల్లా కలెక్టర్
అనుకూలమైన వసతి ఏర్పాటుకు కలెక్టర్ హామీ
✍️ కొత్తగూడెం – దివిటీ (నవంబరు 14)
కొత్తగూడెంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెచ్టర్ జి.వి.పాటిల్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పి.జ్యోతి, శిక్షకులు వి.శారద, రామలక్ష్మి, రజిత, ప్రశాంతి కలెక్టర్‌కు స్వాగతం పలికారు. కళాశాల నిర్వహణకు, బస చేసేందుకు వసతి సరిపోవడం లేదని, ప్రస్తుతం ఆ చిన్న భవనంలో తాము ఇబ్బందులు పడుతున్నామని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కాలేజీకి సరిపోయే విధంగా ఓ విశాలమైన భవనం కేటాయించాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. ఈ సందర్భంగా వసతి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. ఆ కాలేజీకి అనుకూలమైన భవనం కోసం అన్వేషించాలని కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ కు సూచించారు. నర్సింగ్ విద్యార్థులతో మాట్లాడుతూ, తల్లిదండ్రుల ఆశయాల మేరకు కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో స్థిరపడాలని సూచించారు. ఏవైనా పుస్తకాలు కావాలంటే చెప్తే ఏర్పాటు చేస్తానని ప్రిన్సిపాల్ కు జిల్లా కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీ) విద్యాచందన, జిల్లా విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్, స్థానిక అధికారులు, కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు.