వైద్యులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు
ఆసుపత్రులకు అనుమతులు ఉండాలి
‘క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్’ పై ఐఎంఏ సభ్యులతో కలెక్టర్, ఎస్పీ సమావేశం
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (నవంబరు 13)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ‘క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్’ అమలు తీరుపై చర్చించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, అదనపు కలెక్టర్ విద్యాచందన కూడా పాల్గొన్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఆసుపత్రిలో రోగుల హక్కులు, వారికి అందుతున్న వైద్య సదుపాయాలు, అక్కడ పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బంది అర్హతలు ఆసుపత్రికి వచ్చే రోగులకు తెలిసేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అర్హతకు మించి వైద్యం చేస్తున్నవారిపై ‘క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్’ ప్రకారం కఠినచర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులపై జరుగుతున్న దాడులను అరికట్టెందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు తక్షణవైద్యం అందించేందుకు దగ్గరలో ఉన్న ఆస్పత్రులకు తరలించి తక్షణం చికిత్స అందేందుకు జియో ట్యాగింగ్ చేయాలని, ప్రమాదకరంగా ప్రదేశాలను గుర్తించాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్.భాస్కర్ నాయక్ మాట్లాడుతూ, ప్రతి ఆసుపత్రిలో, రక్త పరీక్ష కేంద్రాల్లో పరీక్షల ధరల పట్టికను ప్రజలకు తెలిసేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఐఎంఏ అధ్యక్షుడు అరికల భాస్కర్ మాట్లాడుతూ, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం అనుమతుల్లేని ఆసుపత్రులను ,క్లినికల్ లాబ్ లను సీజ్ చేసి, నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ కమిటీ సభ్యుడు డా.మధువరన్, డిప్యూటీ డీఎంహెచ్ఓ ఫైజ్ మొహియుద్దీన్, ఉమామహేశ్వరీ, వివేక్, తదితరులు పాల్గొన్నారు.