‘ఐసీడీఎస్’లో అధికారుల వసూళ్లపై ఆర్జేడీ విచారణ
“దివిటీ మీడియా” కథనంపై స్పందించిన ఉన్నతాధికారులు
పాల్వంచలో రోజంతా విచారణ సాగించిన ఆర్జేడీ
అక్రమాలు వెలుగులోకి రాకుండా చూసుకునేందుకు తంటాలు
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (నవంబరు 13)
ఐసీడీఎస్ లో అధికారుల అవినీతి, అక్రమ వసూళ్లపై పాల్వంచ ప్రాజెక్టులో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ వరంగల్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) ఝాన్సీ లక్ష్మీభాయి బుధవారం విచారణ జరిపారు. ఐసీడీఎస్ టేకులపల్లి, పాల్వంచ ప్రాజెక్టులలో అక్రమ వసూళ్లు, అస్తవ్యస్త పరిస్థితులపై ఈ నెల 10వ తేదీన “దివిటీ మీడియా”లో “సంక్షేమం మాటున చక్కగా వసూళ్లు” శీర్షికతో ప్రచురితమైన కథనంపై మహిళా, శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఆదేశించారు. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వరంగల్ ఆర్జేడీ మంగళవారం టేకులపల్లి ప్రాజెక్టులో, బుధవారం పాల్వంచ ప్రాజెక్టులో విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా ఆర్జేడీ ఝాన్సీలక్ష్మీభాయి, ఆ రెండు ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ టీచర్లతోపాటు సూపర్ వైజర్లు, సీడీపీఓల నుంచి వివరాలు తీసుకుని, వాంగ్మూలాలు సేకరించారు. విచారణ సందర్భంగా అనేకమంది అంగన్వాడీ టీచర్లు, సూపర్ వైజర్లు తమ ఇబ్బందులను, గతంలో తాము పడిన బాధలను కూడా మౌఖికంగా పంచుకున్నారు. తమ నుంచి అధికారులు పర్సెంటేజీలు తీసుకున్నది వాస్తవమేనని కొందరు, ఆ విధంగా ఏమీ జరగలేదని మరికొంతమంది విచారణలో రాతపూర్వకంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ ప్రాజెక్టులో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు, సూపర్ వైజర్లు, గత సీడీపీఓలను కూడా విచారణకు పిలిచి పూర్తి వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. విచారణకు ప్రస్తుత సీడీపీఓ లక్ష్మీప్రసన్న, గతంలో అక్కడ పనిచేసిన సీడీపీఓలు కనకదుర్గ, రేవతి, పలువురు సూపర్ వైజర్లు హాజరయ్యారు. అంగన్వాడీ టీచర్లు చాలా మంది స్వేచ్ఛగా అభిప్రాయాలు తెలియజేయకుండానే రకరకాల ప్రభావాలకు లోనైనట్లు సమాచారం. మొత్తం మీద జిల్లాలోనే దుస్థితిలో ఉన్న ప్రాజెక్టుగా పాల్వంచ ప్రాజెక్టు గురించి పలువురు వర్ణిస్తున్నారని అధికారులే బాహాటంగా అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్జేడీ విచారణ చేపట్టిన సందర్భంలో కొందరు అధికారులు “ముడుపులు తీసుకోవడం తప్పయితే… ఆ విధంగా ఇవ్వడం కూడా తప్పే కదా…” అంటూ వ్యాఖ్యానిస్తూ, అంగన్వాడీ టీచర్ల అభిప్రాయాలను ప్రభావితం చేయడం గమనార్హం. ఇదే అంశంలో గతంలో చేసిన ఓ ప్రాథమిక విచారణలో ఆ ప్రాజెక్టులో అధికారులు, ఉద్యోగులు ఇంటి అద్దెల బిల్లుల్లో భారీగా ముడుపులు తీసుకోవడం, అందుకు సూపర్ వైజర్లను మధ్యవర్తులుగా వాడుకోవడం గురించి ‘క్లియర్’గా బయటపడినట్లు గుర్తించారు. ఈ పరిస్థితులలో అక్రమ వసూళ్లకు పాల్పడిన అధికారులు తాజా విచారణలో తమపై చర్యలనుంచి బయటపడేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తన విచారణలో గుర్తించిన అంశాల గురించి మాట్లాడేందుకు విచారణ అధికారి (ఆర్జేడీ) ఝాన్సీలక్ష్మీభాయి నిరాకరించారు. ఈ అంశంలో తాను గుర్తించిన అంశాలు, క్షేత్రస్థాయిలో పరిస్థితులపై నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు అందించడం వరకే తన విధి అని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐసీడీఎస్ పాల్వంచ, టేకులపల్లి ప్రాజెక్టుల విచారణలతోనైనా మహిళా, శిశు సంక్షేమశాఖ ఉన్నతాధికారులు బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.