Divitimedia
Andhra PradeshBhadradri KothagudemCrime NewsHyderabadJayashankar BhupalpallyLife StyleMuluguNational NewsSpot NewsTelangana

అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో సమన్వయంతో పనిచేయాలి

అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో సమన్వయంతో పనిచేయాలి

సరిహద్దు జిల్లాల అధికారులతో సమీక్షించిన డీజీపీ

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (నవంబరు 11)

ఏజెన్సీప్రాంతంలో అభివృద్ధిని అడ్డుకుని, అభివృద్ధి నిరోధకులుగా మారిన మావోయిస్టుల వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తెలంగాణ – చత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దుప్రాంతాల్లో పనిచేసే పోలీస్ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని తెలంగాణ డీజీపీ డాక్టర్.జితేందర్ దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు సోమవారం సారపాకలోని ఐటీసీ అతిథిగృహంలో ఆయన పొరుగు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల పోలీస్ అధికారులతో పరిస్థితులను సమీక్షించారు. డీజీపీ మాట్లాడుతూ, పొరుగు రాష్ట్రాలతో సరిహద్దులు గల జిల్లాల అధికారులు, ఇతర రాష్ట్రాల అధికారులతో సమన్వయం పాటిస్తూ పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. కాలం చెల్లిన సిద్ధాంతాలతో అమాయక ఆదివాసీలను అభివృద్ధికి, సంక్షేమానికి దూరం చేస్తూ నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ అగ్రనాయకులు తమ పబ్బం గడుపుకుంటున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణా ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజలకు విద్య, వైద్యం, రవాణా, తదితర సంక్షేమ పథకాలు అందించడానికి కృషిచేస్తున్నాయని తెలిపారు. మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనాయకులు తమ ఉనికిని చాటుకోవడానికి ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ, ఆ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటూ దుశ్చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న అధికారులు సరిహద్దు ప్రాంతాల్లో తమ తమ పరిధిలో మావోయిస్టుల కదలికలపై ప్రస్తుతమున్న స్థితిగతులను డీజీపీకి వివరించారు. సోమవారం హైదరాబాదు నుంచి సారపాక ఐటీసి గెస్ట్ హౌస్ కు చేరుకున్న డీజీపీ డాక్టర్.జితేందర్ కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు స్వాగతం పలికారు. ఇంటిలిజెన్స్ డీజీపీ శివధర్ రెడ్డి, మల్టీ జోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి కూడా పర్యటనలో పాల్గొన్నారు. సమీక్ష సమావేశానంతరం డీజీపీతోపాటు ఇతర అధికారులందరూ భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు.
కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ అధికారులు, భద్రాద్రి కొత్త గూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాల ఎస్పీలు రోహిత్ రాజు, డా.శభరీష్, కిరణ్ ఖరే, గ్రేహౌండ్స్ ఎస్పీ రాఘవేందర్ రెడ్డి, పలువురు ట్రైనీ ఐపిఎస్ లు కూడా పాల్గొన్నారు. రాష్ట్ర సరిహద్దుల జిల్లా అధికారుల సమన్వయ సమావేశంలో పాల్గొనేందుకు జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర డీజీపీ డాక్టర్.జితేందర్ ఐటీసీ గెస్ట్ హౌస్ లో మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ మొక్కను అందించి స్వాగతం పలికారు.

Related posts

ఘనంగా ప్రారంభమైన రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు

Divitimedia

బూర్గంపాడులో సీపీఎం నాయకుల నిరసన

Divitimedia

కమ్యూనిస్టులకు ‘చెయ్యిచ్చిన’ కారు ఓనరు

Divitimedia

Leave a Comment