తప్పు సరిదిద్దుకున్న ఐసీడీఎస్ ఉన్నతాధికారులు
‘దివిటీ మీడియా’ సాధించిన మరో విజయం
✍️ హైదరాబాద్ – దివిటీ (అక్టోబరు 2)
పదే పదే అవినీతి, అక్రమాల ఆరోపణలు, అస్తవ్యస్త పరిస్థితులతో అభాసుపాలవుతున్న ఐసీడీఎస్ లో తాజాగా జరిగిన తప్పును అధికారులు సరిదిద్దుకున్న వైనమిది. ఐసీడీఎస్ అధికారుల తప్పును ఎత్తిచూపి, సరిదిద్దుకునేలా ‘దివిటీ మీడియా’ చేసిన పోరాటానికి మరోసారి తక్షణ విజయం దక్కింది. జరిగిన తప్పును ఎలుగెత్తి చాటుతూ “అబ్బే… అక్రమాలకు తావే లేదన్నారు… పదే పదే… అదే కానిచ్చేస్తున్నారు…” శీర్షిక తో మంగళవారం (అక్టోబరు 1) ప్రచురించిన కథనంపై ఐసీడీఎస్ రాష్ట్ర ఉన్నతాధికారులు స్పందించారు. ఆ వెంటనే, అదేరోజు తమ తప్పు సరిదిద్దుకున్నారు. తెలంగాణ ఐసీడీఎస్ విభాగంలో ఇష్టానుసారం సాగి పోతున్న డెప్యుటేషన్ల తీరుకు అద్దంపడుతూ, తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్రమాలకు తెరలేపారు. ఆ జిల్లాలోని బూర్గంపాడు ప్రాజెక్టులో సీడీపీఓ పోస్టు ఖాళీ అయిన నేపథ్యంలో అదే ప్రాజెక్టులో ఏసీడీపీఓగా పనిచేస్తున్న రేవతికి బదులుగా, సిరిసిల్ల నుంచి మరో ఏసీడీపీఓ జ్యోతిని సీడీపీఓగా బాధ్యతలు అప్పగిస్తూ, డెప్యుటేషన్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే బదిలీల ప్రక్రియ ముగిసిన తరుణంలో తీవ్రమైన సమస్యలు, కారణాలుంటే తప్ప డెప్యుటేషన్లివ్వడమే తప్పనుకుంటే, అంతకుమించి జరిగిన ఈ వ్యవహారం గురించి “దివిటీ మీడియా”లో ప్రత్యేక కథనం ప్రచురించడంతో కలకలం రేగింది. తీవ్రమైన చర్చకు దారితీసిన ఈ వ్యవహారంతో మరింత అభాసుపాలు కాకుండా, జాగ్రత పడిన ఉన్నతాధికారులు తామిచ్చిన డెప్యుటేషన్ ఆర్డర్ రద్దుచేసి, బూర్గంపాడు ప్రాజెక్టులో ఏసీడీపీఓగా ఉన్న రేవతికి సీడీపీఓగా ఎఫ్ఏసీ (పూర్తి అదనపు బాధ్యతలు) అప్పగిస్తూ అదేరోజు ఆదేశాలు జారీ చేశారు. జ్యోతిని ఏసీడీపీఓగా డెప్యుటేషన్ మీద పంపిస్తూ ఆదేశాలిచ్చారు. ఈ అక్రమ డెప్యుటేషన్లతో భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్న నేపథ్యంలో అసలు పాత్రధారులుగా అక్రమాలకు తెగ బడుతున్న అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం ఇంకా తెలియడం లేదు. ఈ ఆరోపణలు, అక్రమాలతో తెలంగాణ రాష్ట్ర ఐసీడీఎస్ విభాగం మరింత అభాసుపాలు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. పూర్తిస్థాయిలో విచారణ జరిపి, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుని, పరిస్థితులను చక్కదిద్దాల్సిన అవసరం మాత్రం ఉంది.