Divitimedia
Bhadradri KothagudemBusinessCrime NewsHanamakondaHealthHyderabadKhammamLife StyleSpecial ArticlesTechnologyTelanganaWomen

ఐసీడీఎస్ లో అధికారుల అడ్డగోలు ‘దోపిడీ’

ఐసీడీఎస్ లో అధికారుల అడ్డగోలు ‘దోపిడీ’

‘కాసులిచ్చేవారిపై’ కనికరంతో డెప్యుటేషన్లు…

బదిలీల జాతర తర్వాత అందివచ్చిన అవకాశం

భారీస్థాయిలో వసూళ్లకు తెరలేపిన ఓ ఉన్నతాధికారి

✍️ కామిరెడ్డి నాగిరెడ్డి – దివిటీ (ఆగస్టు 24)

“రేపోమాపో దిగిపోతానాయె… ఈ చివరిదశలో వచ్చిన అవకాశాన్ని వదులుకుంటే, అంతకంటే అమాయకత్వం ఏం ఉంటుంది చెప్పండీ…?” అనే రేంజిలో ఆ అధికారి, అందినంత దండుకుంటున్నారు. తాజాగా పూర్తయిన బదిలీలతో తలెత్తిన ఇబ్బందులతో కొందరు, అంతకు ముందున్న ఇబ్బందులతో మరికొందరు ‘డెప్యుటేషన్ల’ కోసం ప్రయత్నిస్తున్నారు. కుటుంబసభ్యులకు కాస్తంత దూరంగా ఉన్న కొంతమంది ‘ఏదో ఒకవిధంగా’ తమను దగ్గర చేయాలని కోరుతూ ‘పైరవీల’ బాట పట్టారు. ఈ పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటున్న రాష్ట్ర స్థాయిలో రెండోశ్రేణిలో ఉన్న ఉన్నతాధికారులు కొంత మంది “భారీగా” వసూళ్లకు పాల్పడుతున్నారు. రాష్ట్ర ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తున్న ఈ రెండవ శ్రేణి ఉన్నతాధికారులు, ఇప్పుడు ‘డెప్యుటేషన్ల’ వరాలు ఇచ్చే దేవతలుగా అవతారమెత్తి, “కలెక్షన్ కింగ్” లుగా మారారు. అసలు ఈ మధ్యనే బదిలీల ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఈ ‘డొంకతిరుగుడు బదిలీలు’ ఏంటనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. ఎక్కడో ఒకరు ఏదో తీవ్రత కలిగిన ఇబ్బందిలో ఉంటేనో? లేదంటే అధికారులు లేక పోవడం వల్ల ఎక్కడైనా పరిపాలనాపరమైన ఇబ్బంది తలెత్తినప్పుడో డెప్యుటేషన్ల మీద అక్కడకు సిబ్బందిని పంపించి సమస్య పరిష్కారం చేయడం సహజమైన విషయమే. కానీ ప్రస్తుతం ‘ఐసీడీఎస్’లో జరుగుతున్న ఈ తతంగం మాత్రం కేవలం ‘కలెక్షన్ల’కోసమేననేది ఆ శాఖలో బహిరంగంగా చర్చించుకుంటున్న పరిస్థితులు ఏర్పడ్డాయి.
—————–
‘రిటైర్మెంట్’కు దగ్గరవుతున్న ఓ అధికారే ‘కలెక్షన్ కింగ్’
—————–
మహిళా, శిశు సంక్షేమశాఖ(ఐసీడీఎస్)లో వివాదంగా మారుతున్న ‘డెప్యుటేషన్ల’ వ్యవహారంలో అతి త్వరలో రిటైర్ కాబోతున్న ఓ అధికారి “కలెక్షన్ కింగ్’ అవతారం ఎత్తి భారీగా దండుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో ‘అనుబంధం’ ఉన్న ఆమెకు ఆ శాఖలో రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న కీలక ఉన్నతాధికారి మరొకరు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఏసీడీపీఓగా విధులు నిర్వర్తిస్తున్న ఓ అధికారి, తన సొంత ఏరియా అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ‘డెప్యుటేషన్’కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆ జిల్లాలోనే పనిచేస్తున్న సీడీపీఓలలో ఇటీవలే కాస్త దూరంగా ఉన్న ప్రాజెక్టుకు బదిలీ అయిన సీడీపీఓ ఒకరు ఎలాగైనా భద్రాచలం వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. భద్రాచలం ప్రాంతంలో పనిచేస్తున్న మరో సీడీపీఓ, ఆ జిల్లాలో కాస్త దూరంగా ఉన్న వివాదాస్పద ప్రాజెక్టులో పనిచేస్తున్న ఇంకొక సీడీపీఓ కూడా ఖమ్మం జిల్లాలో దగ్గరగా ఉన్న ప్రాజెక్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా మరికొంతమంది కూడా రకరకాల కారణాలతో డెప్యుటేషన్ల కోసం తమ వంతు ప్రయత్నాల్లో ఉన్నారు. సరిగ్గా ఈ పరిస్థితుల కోసమే ఎదురు చూస్తూ కాచుకుకూర్చున్న ఆ ద్వితీయ శ్రేణి ఉన్నతాధికారి, “వసూళ్ల పర్వానికి” తెరలేపారు. ఒక్కొక్కరి నుంచి తక్కువలో తక్కువగా రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు డిమాండ్ చేసి మరీ వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న అధికారులైతే ఎంత ఖర్చైనా భరిస్తామంటూ, ఆ అధికారి చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ డెప్యుటేషన్లలో కూడా కాస్త మంచి పోస్ట్ కావాలంటే మరికొంత అదనంగా ముట్టజెప్పాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ‘ఐసీడీఎస్’ కార్యక్రమాలనే అవినీతికరంగా మార్చేసే ప్రమాదమున్న ఈ ‘డెప్యుటేషన్ల వ్యవహారానికి’ ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని ఆ శాఖలో కొందరు అధికారులు, సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.

Related posts

ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక యాప్ విడుదల చేసిన పోలీసుశాఖ

Divitimedia

సంవత్సరంలోపే సమస్యలన్నింటికీ పరిష్కారం

Divitimedia

పొంగులేటి సమక్షంలో కాంగ్రెసులో చేరిన బెల్లంకొండ రామారావు

Divitimedia

Leave a Comment