ఎట్టకేలకు ‘టీజీఈడబ్ల్యుఐడీసీ’ ఖమ్మం ఈఈ నియామకం
ఆలస్యంగానైనా స్పందించిన రాష్ట్ర ఉన్నతాధికారులు
“దివిటీ మీడియా” కథనానికి స్పందన
✍️ హైదరాబాదు – దివిటీ (ఆగస్టు 14)
దాదాపు నెలరోజులకు పైగా కార్యకలాపాలు స్తంభించి పోయిన ‘తెలంగాణ విద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఈడబ్ల్యుఐడీసీ)’ ఖమ్మం కార్య నిర్వాహక ఇంజినీర్(ఈఈ) కార్యాలయానికి ఎట్టకేలకు మోక్షం కలిగింది. అధికారి అందుబాటులో లేకపోవడం, ఆయన స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగించక పోవడం వల్ల కలుగుతున్న ఇబ్బందుల గురించి గత 8 వ తేదీన “దివిటీ మీడియా”లో ”ఒక్కరి కోసం…’ డిపార్ట్ మెంట్ నే ‘బలి చేస్తున్నారు…” శీర్షికతో కథనం ప్రచురించడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఈ మేరకు టీజీఈడబ్ల్యుఐడీసీ ఖమ్మం డివిజన్ ఈఈ గా, డీఈ పి.విన్సెంట్ రావుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆ సంస్థ ఎండీ ఇ.నర్సింహారెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. సంస్థ కరీంనగర్ జిల్లా పెద్దపల్లి సబ్ డివిజన్లో డీఈగా పనిచేస్తున్న విన్సెంట్ రావును ఖమ్మం డీఈగా బదిలీచేస్తూ, ఈఈ పోస్టులో కూడా పూర్తి అదనపు బాధ్యత (ఎఫ్ఏసీ)లు చేపట్టాలని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈ మేరకు విన్సెంట్ రావు, శుక్రవారం బాధ్యతలు చేపట్టనున్నారు.
———————–
నెలరోజులకు పైగా నెలకొన్న అనిశ్చితికి తెరదించిన ఉన్నతాధికారులు
————————
రెండు జిల్లాల్లో అంటే ఉమ్మడి ఖమ్మంజిల్లా పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు పర్యవేక్షించాల్సిన ‘టీజీఈడబ్ల్యుఐడీసీ’ ఖమ్మం ఈఈ అందుబాటులో లేక పోవడంతో ఖమ్మంజిల్లా కలెక్టర్ ఆ డిపార్ట్ మెంట్ చూసే పనులను పంచాయతీరాజ్ శాఖకు బదలాయించాల్సి వచ్చింది… ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో కస్తూర్బా విద్యాలయాలు, పాఠశాలల భవనాలతోపాటు ఇతర సంస్థల్లో అభివృద్ధిపనులు పర్యవేక్షిస్తున్న సంస్థ ఖమ్మం ‘ఈఈ’గా ఉన్న నాగశేషు, గత జులై 8వ తేదీ నుంచి (నెలరోజులకు పైగా) అందుబాటులో లేరు. ఈ దుస్థితి నేపథ్యంలో ఇటీవల ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల పురోగతిపై గత నెల(జులై) 24న చేసిన సమీక్షకు కూడా ఈఈ గైర్హాజరు కావడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీక్షకు ఈఈ కార్యాలయం నుంచి వెళ్లిన ఉద్యోగి కూడా సరైన సమాచారం ఇవ్వలేకపోవడంతో ఆగ్రహించిన కలెక్టర్, షోకాజ్ నోటీస్ జారీ చేశారు. అసలు కార్యాలయానికే రాకుండా, కలెక్టర్ సమీక్షకు కూడా హాజరు కాకుండా ఈఈ నాగశేషు ఏంచేస్తున్నారనేది ఆయన కార్యాలయ సిబ్బందికే సమాచారం లేదు. ఆ పరిస్థితులలో ఖమ్మం జిల్లాలో “అమ్మ ఆదర్శపాఠశాలల కమిటీల” ద్వారా ఆ సంస్థ పర్యవేక్షణలో జరుగుతున్న పనుల పురోగతి ఘోరంగా మారింది. పనుల్లో పురోగతిలేదనే కారణంతో ఖమ్మంజిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, జిల్లా పరిధిలో “టీజీఈడబ్ల్యుఐడీసీ” పర్యవేక్షిస్తున్న మొత్తం 102 పనుల్లో ఏకంగా 75 పనులు “పంచాయతీరాజ్ శాఖ”కు బదిలీ చేశారు. చింతకాని మండలంలో 8, కొణిజర్లలో 12, ముదిగొండలో 24, వైరా మండలంలో 17 పనులు పంచాయతీరాజ్ శాఖ ఖమ్మం ఈఈ, తల్లాడ మండల పరిధిలోని 14పనులు సత్తుపల్లి ఈఈకి బదిలీ చేశారు. ఈఈ అందుబాటులో లేకపోవడం, ఆయన స్థానంలో మరో అధికారిని నియమించకపోవడం వల్ల ఉమ్మడి ఖమ్మంజిల్లాలో టీజీఈడబ్ల్యుఐడీసీ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు జీతాలు కూడా రాని దుస్థితి ఏర్పడింది. ఆ సంస్థ పర్యవేక్షించే పనుల నుంచి ‘సర్వీస్ ఛార్జీల’ రూపంలో వచ్చే నిధులతోనే సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో ఆ పనులను వేరే శాఖకు బదలాయించితే సిబ్బందికి అసలు పనేలేకుండా పోతోంది. ఖమ్మం ఈఈ నాగశేషు, విధులకు హాజరు కాలేకపోతున్నప్పటికీ ఆ బాధ్యతలు మరొకరికి అప్పగించడంలో జాప్యానికి కారణం ఏమిటనేది ఎవరికీ అంతుచిక్కలేదు. ఆయన సమస్యల నుంచి బయటపడి, తిరిగివచ్చి బాధ్యతలు నిర్వర్తించే వరకు అక్కడ మరొకరికి ఈఈ బాధ్యతలు అప్పగించకుండా చూసేందుకు ‘టీజీఈడబ్ల్యుఐడీసీ’ రాష్ట్రస్థాయి ఉన్నతాధికారి ఒకరు ‘చక్రం తిప్పినట్లు’ తెలుస్తోంది. అందుకే ఈ వ్యవహారంలో మరొకరికి ఎఫ్ఏసీ ఇచ్చేందుకు ఇంతకాలం జాప్యం జరిగిందని విశ్వసనీయ సమాచారం. ఏదిఏమైనా ఎట్టకేలకు ఆ సంస్థ ఎండీ నర్సింహారెడ్డి తీసుకున్న చర్యలతో మళ్లీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సంస్థ పనితీరు గాడిలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారాన్నింటినీ వెలుగులోకి తెచ్చి, పరిస్థితి చక్కదిద్దేలా కృషి చేసిన “దివిటీ మీడియా”కు ఆ సంస్థ సిబ్బంది కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.