పదవులు లేకున్నా ప్రజాసేవకు విరామం వద్దు
జడ్పీ పాలకవర్గ చివరి సమావేశంలో ప్రముఖులు
పాల్గొన్న జిల్లా ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జులై 28)
ప్రజాప్రతినిధులుగా తమ పరిధిలో ప్రజలకు సేవచేసే భాగ్యం లభించడం అదృష్టమని, పదవులున్నా, లేకున్నా ప్రజాసేవకు విరామం ఇవ్వవద్దని పలువురు ప్రముఖులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ పాలక వర్గ సభ్యులకు సూచించారు. ప్రస్తుత జిల్లా పరిషత్ పాలకమండలి సభ్యుల పదవీకాలం వచ్చేనెల(ఆగస్టు) 6వ తేదీన పూర్తవుతున్న నేపథ్యంలో ఆదివారం చివరి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని ‘కొత్తగూడెం క్లబ్’లో నిర్వహించిన ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావుతోపాటు జడ్పీ పాలకవర్గ సభ్యులను ఘనంగా సన్నానించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ శ్రీ రోహిత్ రాజు, కొత్తగూడెం, ఇల్లందు, వైరా శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, కోరం కనకయ్య, మాలోత్ రాందాస్ నాయక్, డీసీఎంఎస్ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు హాజరయ్యారు. పదవీ కాలం పూర్తి చేసుకున్న జిల్లా పరిషత్ సభ్యులకు ఈ సందర్భంగా అతిథులు పలు సూచనలు, సలహాలు అందజేశారు. అభివృద్ధిలో సేవలు కొనసాగించాలని కోరారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కంచర్ల చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధిలో గత ఛైర్మన్ కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు సేవలను ప్రశంసించారు. ఈ విషయంలో జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, అధికారుల సహకారం మరువలేనిదన్నారు. జడ్పీ సమావేశాల్లో స్నేహపూరిత వాతావరణం నడుమ నిధుల కొరత ఉన్నప్పటికీ ప్రతి సమస్యను సాధ్యమైనంత వరకు సమన్వయంతో పరిష్కరిచుకున్నట్లు తెలిపారు. రెండు సార్లు కరోనా సమయంలో కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు నిస్వార్ధముగా సేవలనందించారని, జిల్లాను కరోనా రహిత జిల్లాగా తీర్చిదిద్దుకున్నామని ఆనందం వ్యక్తం చేశారు. జాతీయస్థాయిలో జిల్లా నుంచి చుంచుపల్లి, గౌతంపూర్ గ్రామపంచాయతీలకు ఉత్తమ పంచాయతీ అవార్డులు లభించడం గర్వకారణమన్నారు. ఈ చివరి
సర్వసభ్య సమావేశంలో కూడా వైద్య, ఆరోగ్యశాఖ, వ్యవసాయశాఖ, పారిశుధ్య కార్యక్రమాలపై సమీక్షించి, సమస్యలపై చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు.
చంద్రుగొండ, లక్ష్మిదేవిపల్లి, జూలూరుపాడు, గుండాల, ములకలపల్లి, సుజాతనగర్, బూర్గంపాడు, పాల్వంచ, మణుగూరు జడ్పీటీసీ సభ్యులు వెంకటరెడ్డి, మేరెడ్డి వసంత, బిందు చౌహాన్, మంజుభార్గవి, సున్నం నాగమణి, కామిరెడ్డి శ్రీలత, బరపటి వాసుదేవరావు, పోశం నర్సింహరావు, అశ్వాపురం, గుండాల ఎంపీపీలు ముత్తినేని సుజాత, ముక్తి సత్యం, తదితరులు వివిధ అంశాలు, సమస్యలపై మాట్లాడారు. ఆ సమస్యలన్నీ పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తానని జిల్లాకలెక్టర్ జితేష్ వి పాటిల్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ కె.చంద్రశేఖర్, డీఎంహెచ్ఓ డా.భాస్కర్ నాయక్, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి బాబురావు, ఉద్యానవన శాఖ జిల్లా అధికారి కె.సూర్యనారాయణ, పలువురు ఎంపీపీలు, అధికారులు, జడ్పీటీసీ సభ్యుల కుటుంబ సభ్యులు, అనుచరులు పాల్గొన్నారు.