నర్సరీ ఆధునీకరణ ప్రణాళికలకు ఐటీడీఏ పీఓ ఆదేశాలు
✍️ కొత్తగూడెం – దివిటీ (జులై 20)
ఐటీడీఏ ఆధ్వర్యంలో నడపబడుతున్న గరిమెళ్లపాడు నర్సరీని ఆధునీకరించి వివిధ రకాల పండ్ల మొక్కలు, కూరగాయల మొక్కలతో నర్సరీని మరింత అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అధికారులను ఆదేశించారు.
శనివారం గరిమెళ్లపాడు నర్సరీని సందర్శించిన పీఓ, ప్రస్తుతం నర్సరీ, పండ్లతోటల పెంపకం తీరు బాగానే ఉందని అభిప్రాయపడ్డారు. ఇంకా 50శాతం ఖాళీ ప్రదేశం ఖాళీగా ఉన్నందున వివిధ రకాల కూరగాయల తోటలు, పండ్లతోటలు అభివృద్ధి చేయాలన్నారు. వాటి సంరక్షణ బాధ్యత తీసుకుని నర్సరీని ఇంకా అభివృద్ధి చేయడానికి కృషి విజ్ఞానకేంద్రం సైంటిస్టు ద్వారా ఏ ఏ విభాగాల్లో ఏ ఏ మొక్కలు వేస్తే పెరుగుతాయనేదానిపై స్థల పరిశీలన చేసి నివేదికలు సమర్పించాలన్నారు. నర్సరీని మరింత అభివృద్ధి చేసేందుకు రాజమండ్రిలో, కడియం మండలంలో నర్సరీని ఉద్యానవన అధికారి, వ్యవసాయ అధికారి సందర్శించాలని ఆదేశించారు. ఆ ప్రాంతంలో పండ్లతోటలు, కూరగాయలు పండించడం కోసంఎలాంటి పద్ధతులు అనుసరిస్తున్నారనేది చూసి తెలుసుకుని, గరిమెళ్లపాడు నర్సరీ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఉద్యానవన అధికారి అశోక్, ఎన్ఆర్ఈజీఎస్ టీఏ నాగరాజు, డీఆర్డీఏ ప్లాంటేషన్ మేనేజర్ రాజు, కృషి విజ్ఞాన కేంద్రం సైంటిస్ట్ శివ, తదితరులు పాల్గొన్నారు.