Divitimedia
Bhadradri KothagudemBusinessEducationLife StyleSpot NewsTelanganaWomen

మహిళల ఆర్ధికాభివృద్ధి కోసమే మహిళాశక్తి పధకం

మహిళల ఆర్ధికాభివృద్ధి కోసమే మహిళాశక్తి పధకం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జులై 15)

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘మహిళాశక్తి పథకం’ అమలు చేస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఐడీఓసీ కార్యాలయ సమావేశమందిరంలో సోమవారం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మహిళాశక్తి పథకం గురించి నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ అవగాహన సదస్సులో అన్ని మండలాల ఎంపీడీఓలు, ఏపీఎంలు, మహిళాసంఘ సభ్యులు, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు, కార్యవర్గ సభ్యులకు అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళలకు జీవనోపాధి కల్పించి, కోటీశ్వరులను చేసే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించిందని, ఈ జిల్లాలో పథకాన్ని విజయవంతంగా అమలుపరచాలని తెలిపారు. స్వయం సహాయక సంఘాల ద్వారా పలు రకాల పరిశ్రమలు ఏర్పాటు చేసి, మహిళాభ్యున్నతికి ఈ పథకం తోడ్పడుతుందని తెలిపారు. మహిళా సంఘాలు ఏర్పాటు చేసే ప్రతి పరిశ్రమపై అవగాహన, ధైర్యం ఉంటేనే వారు విజయం సాధిస్తారని తెలిపారు. చిన్న పరిశ్రమలు వాటి ద్వారా తయారయ్యే వస్తువుల మార్కెటింగ్, ప్రజలకు అవసరమైన వస్తువులు ఉత్పత్తి చేయడం ద్వారా విజయం సాధించవచ్చన్నారు. పూర్తి నాణ్యత పాటిస్తూ, ఆకర్షణీయమైన ముద్ర రూపొందించుకోవాలని సూచించారు. పెరటి కోళ్లు, తేనెటీగలు, అజోలా, చేపల పెంపకం, పాడి పరిశ్రమ, కుట్టుమిషన్ కేంద్రాలు, మీసేవ కేంద్రాలు, ఆహార పదార్థాల తయారీ కేంద్రాలు, డబ్బావాలా కేంద్రాలు, తదితర చిన్నతరహా పరిశ్రమలు స్థాపించడం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని తెలిపారు. మహిళా సంఘంలోని సభ్యులందరూ సమన్వయంతో కృషిచేసి అభివృద్ధి సాధించాలని, ఏర్పాటు చేసే ప్రతి పరిశ్రమలో ఎంత ఆదాయం వస్తుందనే అంచనా వేసుకోవాలని ఆయన తెలిపారు. మహిళా సంఘాలకు ఏదైనా చిన్న పరిశ్రమల స్థాపనకు శిక్షణ కూడా అందిస్తామని కలెక్టర్ తెలిపారు. అన్ని మండలాల ఎంపీడీఓలు,ఏపీఎంలు వారి వారి లక్ష్యాలకోసం మహిళా సంఘాలపై ఒత్తిడి తేవద్దని, వారికి అవగాహన ఉన్న పరిశ్రమలఏర్పాటుపై ప్రోత్సహించాలని సూచించారు. వచ్చే సంవత్సరంలో వ్యవసాయం, చేపలపెంపకం, పాడిపరిశ్రమ, కోల్డ్ స్టోరేజ్, వంటి ప్రయోగాత్మకమైన పద్ధతుల ద్వారా అభివృద్ధి సాధించడమే జిల్లా లక్ష్యమని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ విద్యాచందన, జడ్పీ సీఈఓ చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయశాఖాధికారి బాబురావు, ఉద్యానవన అధికారి సూర్యనారాయణ, పశుసంవర్ధక శాఖాధికారి పురందరేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఉత్సాహంగా సీఎం కప్ క్రీడాపోటీలు

Divitimedia

ఐసీడీఎస్ లో అధికారుల అడ్డగోలు ‘దోపిడీ’

Divitimedia

పార్ట్ టైం ఫ్యాకల్టీగా పనిచేసేందుకు దరఖాస్తుల ఆహ్వానం

Divitimedia

Leave a Comment