ప్రజలకోసం సమన్వయంతో పనిచేయాలి
జిల్లాస్థాయి సమీక్షలో మంత్రి పొంగులేటి
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ మీడియా (జూన్ 11)
ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరవేసేందుకు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేసి ప్రజలెవరూ ఏ ఇబ్బందీ పడకుండా చూడాల్సిన బాధ్యత ఉందని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం ఐడీఓసీ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ, గృహనిర్మాణ శాఖలపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం, అనంతరం పత్రికా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నో ఆశలతో, నమ్మకంతో తమను ఎన్నుకున్న ప్రజల కోసం అధికారులు, ఎమ్మెల్యేలను సంప్రదించి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్లు, త్రాగునీరు, విద్య, వైద్యం, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, కల్వర్టుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితంతు మహిళలు, ఒంటరి మహిళలకు ఆసరా పింఛన్లు అందేలా చూడాలని ఆదేశించారు. జిల్లాలోని గ్రామపంచాయతీలలో మౌలిక వసతుల కల్పన, రోడ్లు, డ్రైనేజీలు, అంగన్వాడి స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలల్లో ఏమైనా రిపేర్లుంటే సాధ్యమైనంత తొందరగా పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. గత ప్రభుత్వంలో రు.39వేల కోట్ల ఖర్చుతో చేసిన మిషన్ భగీరథ మంచినీటి సరఫరా అస్తవ్యస్తంగా ఉందని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ భగీరథ ద్వారా జిల్లాలో అన్ని గ్రామాల్లోని ప్రతి ఇంటికి మంచి నీరు అందే విధంగా చర్యలు చేపట్టామన్నారు. గిరిజన గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి అటవీశాఖ అడ్డంకులు సృష్టిస్తే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. భద్రాచలం, కొత్తగూడెం డివిజన్లలో 30శాతానికి మించి నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తిచేసి లబ్ధిదారులకు అందించాలన్నారు. అమ్మ ఆదర్శపాఠశాల పనులు త్వరగా పూర్తిచేసి, పిల్లలకు ఇబ్బంది కలగకుండా పండుగ వాతావరణంలో ప్రజాప్రతినిధులను సంప్రదించి పాఠశాలలు ప్రారంభోత్సవం చేయాలని, అదేరోజు పిల్లలకు బుక్స్, యూనిఫామ్, మిగతా సామగ్రి మెటీరియల్ అందజేయాలన్నారు. రాష్ట్రంలో అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పిల్లలకు మొదటి విడతగా తెలుగులో విద్యాబోధన ప్రారంభించామని, రాబోయే రోజుల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన ప్రవేశపెట్టి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రంలో రూ.650 కోట్ల పైగా ఖర్చుతో పెద్ద ఎత్తున పాఠశాలల నిర్మాణం చేపట్టామని, 80 శాతం వరకు పూర్తయ్యాయని, వారం రోజుల్లో అన్నీ పూర్తయ్యేలా జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. రాష్ట్రంలో విద్యను బలోపేతం చేయడానికి స్కూల్స్ తో పాటు కాలేజీల నిర్మాణం కూడా చేపట్టామన్నారు. అవతవకలు జరగకుండా ధరణి దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ ముఖ్యంగా గిరిజన రైతులకు ఇబ్బందులు కలగకుండా పూర్తిచేయాలని, అవకతవకలు జరిగినట్లు తన దృష్టికొస్తే, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. రాష్ట్రంలో 2.45 లక్షల పెండింగ్ ధరణి దరఖాస్తుల్లో ఎలక్షన్ కోడ్ రాకముందే లక్ష వరకు క్లియర్ చేశామన్నారు. మిగిలిన దరఖాస్తులు, కొత్తవి కలుపుకొని 2.55లక్షల దరఖాస్తులలో ధరణి లోపాలు సరిదిద్ది యుద్ధ ప్రాతిపదికన వారం రోజుల్లో పరిష్కరిస్తామని మంత్రి వెల్లడించారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కొత్తగూడెం నియోజకవర్గం లో చాతకొండ, రేగళ్ల ,పాల్వంచ, తదితర గ్రామాలలో వేల ఎకరాలకు ఆన్లైన్ ప్రక్రియలలో సమస్యలున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ సమన్వయంతో వారంలో సమస్య పరిష్కరించాలని సూచించారు. వర్షాకాలం ప్రారంభమైనందున వైద్యం పరంగా మారుమూల గిరిజన గ్రామాలలో జాగ్రత్తలు తీసుకోవాలని, పి.హెచ్.సిలలో సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. మారుమూల గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేకంగా అంబులెన్సులను అందుబాటులో ఉంచుకోవాలని, సిబ్బంది స్థానికంగా ఉండేలా వైద్యశాఖాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ, ఆర్డీఓలు, జిల్లా అధికారులు అన్ని ఆసుపత్రులను తనిఖీ చేయాలని, సిబ్బంది అందరూ ఉండేలా చూడాలని ఆదేశించారు. అసంపూర్తిగా నిలిచిన ఆరోగ్యకేంద్రాల నిర్మాణం వెంటనే పూర్తిచేయాలన్నారు. భద్రాచలం నియోజకవర్గం లో ఎక్కువశాతం గిరిజన గ్రామాల్లో త్రీఫేజ్ విద్యుత్తు సరిగా లేదని, మెరుగుదలకు సర్వే చేపట్టి ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. వైరా నియోజకవర్గంలో ఎక్కువగా గిరిజన గ్రామాలు ఉన్నందున అటవీశాఖ అభ్యంతరాలు లేకుండా చేసి వ్యవసాయ భూములకు విద్యుత్తు సౌకర్యం, బోర్లు వేయించాలన్నారు. జిల్లాలోని రైతులకు నాణ్యమైన విత్తనాలతో పాటు ఆగస్టు, సెప్టెంబర్ మాసం వరకు ఎరువులు సిద్ధంగా ఉంచి రైతులందరికీ అందేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో కరెంటు సమస్య లేకుండా చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఆగస్టు 15వ తేదీలోగా రైతులందరికీ రుణ మాఫీ చేయడానికి సీఎం హామీ ఇచ్చారన్నారు. ప్రభుత్వ భూములు గానీ, ఇతరుల పట్టాభూములు గానీ ఎవరైనా కబ్జా చేసినట్లు తమ దృష్టికొస్తే వెంటనే వారిపై క్రిమినల్ కేసులు పెట్టి కఠినచర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి జిల్లా కలెక్టరును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, కొత్తగూడెం, పినపాక, ఇల్లందు, వైరా, భద్రాచలం, అశ్వారావుపేట శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, మాలోతు రాందాస్, తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల, ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్, జెసీ వేణుగోపాల్, డీఆర్ఓ రవీంద్రనాథ్, కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీఓలు మధు, దామోదర్ రావు, డీఎఫ్ఓ కృష్ణగౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.