ధాన్యం కొనుగోలు కేంద్రం తనిఖీ చేసిన ప్రత్యేకాధికారి
కొనుగోళ్లతీరుపై కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ మీడియా (మే 21)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రత్యేకాధికారి సురేంద్రమోహన్ మంగళవారం సుజాతనగర్ లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలోని ధాన్యాన్ని పరిశీలించిన ఆయన ధాన్యంలో తేమ 20శాతంగా ఉన్నట్లు గుర్తించి, ధాన్యం కొనుగోలు కేంద్రానికి తెచ్చే ధాన్యం తేమశాతం 17శాతంలోపు వచ్చేదాకా ఆరబెట్టుకోవాలని రైతులకు సూచించారు. కొనుగోలుకేంద్రంలో ఉన్న ధాన్యం అకాల వర్షాలకి తడవకుండా టార్పాలిన్లతో కప్పి ఉంచాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని సకాలంలో సంబందిత మిల్లులకు తరలించాలని ఆ కేంద్రం నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా సుజాతనగర్ లో గల శ్రీ దుర్గా పారాబాయిల్డ్ రైస్ మిల్లును సందర్శించిన ఆయన కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకొని సకాలంలో సి.ఎం.ఆర్ సరఫరా చేయాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ విద్యాచందన, పౌరసరఫరాల కార్పొరేషన్ జిల్లా మేనేజర్ త్రినాధ్ బాబు, జిల్లా పౌరసరఫరాల అధికారి రుక్మిణి, జిల్లా వ్యవసాయాధికారి బాబురావు, జిల్లా మార్కెటింగ్ అధికారి అలీమ్, జిల్లా సహకార అధికారి ఖుర్షీద్, తదితరులు పాల్గొన్నారు.
—————-
కొనుగోళ్లపై సమీక్షించివ ప్రత్యేకాధికారి
—————-
జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్షించివ జిల్లా ప్రత్యేకాధికారి సురేంద్రమోహన్, ఈ మే నెలాఖరులోగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ సమావేశమందిరంలో కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅలతో కలిసి సంబంధిత అధికారులతో ధాన్యం కొనుగోళ్లతీరు పట్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 136 కొనుగోలు కేంద్రాలతో ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామని, 1,33,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, జిల్లాలో ఇప్పటివరకు 1,24,000 క్వింటాల ధాన్యం 2081మంది రైతుల వద్ద నుంచి కొనుగోలు చేశామని జిల్లా కలెక్టర్ ప్రియాంకఅల ఈ సందర్భంగా వివరించారు. ఈ ధాన్యానికిగాను రూ.24 కోట్లు రైతులకు జమచేశామని వెల్లడించారు. ప్రత్యేకాధికారి సురేంద్రమోహన్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు జరిగిన ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మే నెలాఖరులోగా మిగిలిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అకాలవర్షాల వల్ల ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. ధాన్యంలో తేమ శాతం ఉన్నప్పటికీ కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం డెలివరీకి సంబంధించిన వివరాలు అధికారుల నుంచి తెలుసుకున్నారు. సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డీఆర్డీఓ విద్యాచందన, జిల్లా సివిల్ సప్లై అధికారి రుక్మిణి, జిల్లా వ్యవసాయాధికారి బాబురావు, ఆర్టీఓ కిషన్ రావు, తూనికలు కొలతల శాఖ అధికారి మనోహర్, జిల్లా మార్కెటింగ్ అధికారి అలీమ్, జిల్లా సహకార శాఖ అధికారి ఖుర్షీద్, సివిల్ సప్లై డీఎం త్రినాథ్ బాబు, జీసీసీ డివిజనల్ మేనేజర్ విజయకుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.