బాలల హక్కులు, సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాం
✍️ దివిటీ మీడియా – కొత్తగూడెం (మే 17)
బాలల హక్కులు, సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల తెలిపారు. బాలల సంరక్షణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల చట్టాల అమలు వంటి అంశాల్లో తీసుకుంటున్న చర్యలపై సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో జరిగిన డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశంలో జిల్లాకలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో బాలల సంరక్షణ కేంద్రాల ద్వారా బాలలకు రక్షణ కల్పిస్తున్నామన్నారు. పూర్తిస్థాయిలో సంరక్షణ అందించి ప్రయోజకులను చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులు, కమిటీ సభ్యులకు కలెక్టర్ సూచించారు. బాలల భద్రత, శ్రేయస్సుకు సంబంధించి ప్రభావితం చేసే సమస్యలపై కమిటీ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. ఓపెన్ షెల్టర్స్‌లో ఆశ్రయం పొందుతున్న వీధి బాలల వివరాలను సేకరించి పూర్తిస్థాయి విచారణ జరిపిన అనంతరం వారి తల్లిదండ్రులు, సంరక్షకులకు అప్పగించాలని ఆదేశించారు. ఎవరూ ముందుకురాని అనాథలను బాలలగృహాలలో పూర్తి సంరక్షణ కల్పించే చర్యలు తీసుకోవాలన్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బాలల గృహాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, వారికి కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించాలన్నారు. పిల్లల సంరక్షణ, రక్షణ చట్టంలో పేర్కొన్న బాలల హక్కులను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బాలల రక్షణ, సంరక్షణ, బాల్యవివాహాల నిరోధం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ విద్యాచందన, డీడబ్ల్యుఓ విజేత, ఎస్సీ, బీసీ, మైనార్టీ సంక్షేమాధికారులు అనసూయ, ఇందిర, సంజీవరావు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ షర్ఫుద్దీన్, సంక్షేమ సమితి సభ్యులు, పోలీస్ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.