తొలిసారి సొంత ఊరిలో ఓటు వేసిన వేపలగడ్డవాసులు
✍️ దివిటీ మీడియా – బూర్గంపాడు (మే 14)
స్వతంత్ర భారత ఎన్నికల చరిత్రలో ఓ గ్రామస్థులు తొలి సారి తమ సొంత ఊరిలోనే ఓటుహక్కు వినియోగించుకున్న అపూర్వ ఘట్టమిది… ఎన్నికలు జరిగిన ప్రతిసారి తమ గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటుహక్కు వినియోగించుకోవాల్సిన దుస్థితి నుంచి ఆ గ్రామస్థులు బయటపడ్డారు. తమకు పోలింగ్ కేంద్రం అందుబాటు లోకి వచ్చినందుకు వారెంతో ఆనందించారు. ఎంతో ఉత్సాహంగా తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని వేపలగడ్డ గ్రామస్తులకు తొలిసారి సొంత ఊరిలో ఓటువేసే అవకాశం కలిగింది. మొత్తం 860 మంది ఓటర్లున్న ఈ గ్రామంలో తొలిసారి ఓ పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు.అంతకుముందు మోరంపల్లిబంజర గ్రామపంచాయతీలో కలిసి ఉండేది. ఆ తర్వాత ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తొలి సారి ఈ గ్రామంలోనే పోలింగ్ బూత్ ఏర్పాటు చేయడంతో వేపలగడ్డ గ్రామస్తులకు సౌకర్యవంతంగా ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కలిగింది. మూడు కిలోమీటర్లు వెళ్లి ఓటువేసే బాధ తప్పిందని ఆ గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.