Divitimedia
Bhadradri KothagudemCrime NewsNational NewsTelangana

సరి ‘హద్దులు దాటుతున్న’ పేదల బియ్యం

సరి ‘హద్దులు దాటుతున్న’ పేదల బియ్యం

భారీగా రేషన్ బియ్యం పట్టుకున్న బూర్గంపాడు పోలీసులు

✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిరుపేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ (ప్రజా పంపిణీ వ్యవస్థ) బియ్యం సరిహద్దులు దాటుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీమొత్తంలో నిధులు వెచ్చించి పేదల కోసం అతి తక్కువ ధరతో సరఫరా చేస్తున్న సబ్సిడీ బియ్యాన్ని అక్రమార్కులు ‘స్వాహా’ చేస్తున్నారు. జిల్లా నుంచి రూ.కోట్ల విలువైన రేషన్ బియ్యాన్ని డిమాండ్ ఎక్కువ ఉన్న ఇతర రాష్ట్రాలకు దొంగచాటుగా తరలిస్తున్న వ్యాపారులు ఈ అక్రమ దందాలో రూకోట్లు వెనకేసుకుంటూ  దోపిడీ సాగిస్తున్నారు. ఈ అక్రమ దందాకు ‘చెక్ పెట్టేలా’ బూర్గంపాడు పోలీసులు, భారీ మొత్తంలో బియ్యం అక్రమంగా సరిహద్దులు దాటకుండా అడ్డుకున్నారు. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత తమకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు  పీడీఎస్(రేషన్) బియ్యం లోడుతో వస్తున్న లారీని బూర్గంపాడు మండలంలో స్వాధీనం చేసుకున్నారు. బూర్గంపాడు ఎస్సై రాజ్ కుమార్, అదనపు ఎస్సై నాగభిక్షం, ఏఎస్ఐ అప్పారావు, కానిస్టేబుళ్లు  దుర్గారావు, మల్లికార్జున్ లారీని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ తోపాటు, ఆ లారీలో ఉన్న మరొక వ్యక్తిని విచారించగా, లారీలోని   300 క్వింటాళ్ల బియ్యం ఒడిశా రాష్ట్రంలోని మల్కనగిరి జిల్లాకు అక్రమంగా తరలిస్తున్న విషయం వెల్లడైంది. మల్కనగిరి జిల్లాకు ఆ లారీ యజమాని గణేష్ చంద్రడే, డ్రైవర్ సదాశివ పాల్వంచ నుంచి అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ బియ్యం పాల్వంచలోని నరిగె రవీంద్రనాథ్ అనే వ్యక్తికి చెందిన శ్రీ రామాంజనేయ రైస్ మిల్లు నుంచి ఒడిశా రాష్ట్రం మల్కానగిరికి  తరలిస్తున్నారని బూర్గంపాడు ఎస్సై రాజ్ కుమార్ ‘దివిటీ మీడియా’కు చెప్పారు. లారీ స్వాధీనం చేసుకున్న పోలీసులు సివిల్ సప్లై డెప్యూటీ (నాయబ్) తహసిల్దారు కస్తాల వెంకటేశ్వరరావుకు సమాచారం అందించి, అవి ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన బియ్యం అనే విషయం నిర్ధారించుకున్నారు. డెప్యూటీ తహసిల్దారు వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో లారీయజమాని గణేష్ చంద్రడే,  డ్రైవర్ సదాశివ, పాల్వంచలోని రైస్ మిల్లు యజమాని నరిగె రవీంద్రనాథ్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజ్ కుమార్ ఈ సందర్భంగా వివరించారు.

Related posts

కచ్ ప్రాంతంలోని ధోర్డో గ్రామానికి ఐక్యరాజ్య సమితి గుర్తింపు

Divitimedia

పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రతతో ఆరోగ్యంగా ఎదగాలి

Divitimedia

టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డు

Divitimedia

Leave a Comment