కేరళ, దక్షిణ తమిళనాడు, లక్షద్వీప్, అండమాన్-నికోబార్ దీవులకు ఉప్పెన హెచ్చరిక
రేపు, ఎల్లుండి జాగ్రత్తగా ఉండాలని ఆ ప్రాంతవాసులకు సూచన
✍️ దివిటీ మీడియా – హైదరాబాదు (మే 3)
దేశంలోని, లక్షద్వీప్, కేరళ, దక్షిణ తమిళనాడు, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, అండమాన్-నికోబార్ దీవులకు శని,ఆదివారాలలో ఉప్పెన ముప్పు పొంచి ఉందని భారత భూభౌతిక విజ్ఞానశాఖ (ఎంఒఇఎస్)కు చెందిన ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) సంస్థ శుక్రవారం ఓ ప్రకటనలో హెచ్చరించింది. ఈ క్రమంలో ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాలలోని లోతట్టు ప్రాంతాలలో కూడా వరదలు సంభవించే అవకాశాలున్నాయని పేర్కొంది. ముఖ్యంగా లోతట్టు తీర ప్రాంతాలు ప్రమాదానికి గురవుతాయని ఆ సంస్థ వెల్లడించింది.
దక్షిణ హిందూమహాసముద్రంలో దక్షిణాన ప్రస్తుతం, సుదూర దక్షిణ హిందూమహాసముద్రం నుంచి సమీపిస్తున్న అధిక కాలపు అలల ప్రభావంతో ఉబ్బెత్తు, కఠినమైన సముద్ర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ పరిస్థితి ఏప్రిల్ 26న భారత తీరానికి దాదాపు 10,000 కి.మీ దూరంలో దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రారంభమైందని, ఏప్రిల్ 28 నాటికి దక్షిణ హిందూ మహాసముద్రం వైపు నెమ్మదిగా కదిలిందని ఆ సంస్థ వెల్లడించింది. దీని కారణంగా మే 4 తెల్లవారుజామున (2:30 AM)కు భారతదేశపు దక్షిణ కొనను తాకుతుందని అంచనా వేశారు. భారతీయ తీర ప్రాంతాల వైపు వచ్చే ఈ పరిస్థితుల కారణంగా మే 4, 5తేదీలలో లక్షద్వీప్, కేరళ, దక్షిణ తమిళనాడు, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, అండమాన్- నికోబార్ దీవులు, ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాలలో లోతట్టు ప్రాంతాలలో వరదలు సంభవించి, లోతట్టు తీరప్రాంతాలు ప్రమాదానికి గురవుతాయని వివరించారు. ప్రస్తుతం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, దీనికి సంబంధించిన తాజా సమాచారం, అప్‌డేట్స్ కోసం www.incois.gov.in/portal/osf/osf.jsp వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని ప్రజలకు సూచించింది.
సముద్ర సమీప తీరం/బీచ్ ప్రాంతంలో, ప్రత్యేకించి లోతట్టు ప్రాంతాల్లో అడపాదడపా అలలు (సముద్రపు నీరు ఉధృతంగా ప్రవహించే అవకాశం) గురించి జాగ్రత్తగా ఉండాలని మత్స్యకారులు, తీరప్రాంత ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశారు. తగిన జాగ్రత్తలు తీసుకుని, పడవలు దెబ్బతినకుండా ఉండేందుకుగాను ఒకదానికొకటి చాలా దూరంలో లంగరు వేయాలని సూచించారు. మే 4, 5తేదీలలో బీచ్, సమీపప్రాంతాల్లో వినోద కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేసినట్లు పేర్కొన్నారు.