Divitimedia
Bhadradri KothagudemCrime NewsHealthHyderabadLife StyleSpecial ArticlesTelanganaWomen

ఐసీడీఎస్ లో అక్రమార్కులదే ఇష్టారాజ్యం

ఐసీడీఎస్ లో అక్రమార్కులదే ఇష్టారాజ్యం

అంగన్ వాడీలకు కుళ్లిపోయిన కోడిగుడ్లు సరఫరా

✍️ దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 2

కాసుల కక్కుర్తితో కాంటాక్టర్లు సరఫరా చేస్తున్న ఆహార పదార్థాలు పేద చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అనారోగ్యకరంగా పరిణమిస్తోంది. పేదరికం కారణంగా సరైన పోషకాహారం తీసుకోలేనివారి నిస్సహాయతను గుర్తించిన ప్రభుత్వం, తమకందిస్తున్న పోషకాహారంపైన నమ్మకంతో తీసుకుంటున్న అమాయక లబ్దిదారులకు నాసిరకం ఆహారం సరఫరా అవుతోంది. తమ ఆరోగ్యం పెంచాల్సిన ఆహారమే అనారోగ్యానికి దారితీస్తుందేమో అనే భయంతో కొందరు, ప్రభుత్వం ఇస్తున్న ఆహారానికే దూరనువుతున్న దుస్థితి నెలకొంది.

పలు అక్రమాలు, అవకతవకలకు నిలయంగా పేరు పడిపోయిన భద్రాద్రి కొత్తగాడెం జిల్లా ఐసీడీఎస్ లో నేటికీ అవే ఘోరమైన పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి. తాజాగా పాల్వంచ ప్రాజెక్టులో బయటపడిన ఉదంతమే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ ప్రాజెక్టులోని కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో కుళ్లిన కోడిగుడ్లు సరఫరా అవుతున్నాయనే విషయం వెలుగు చూసింది. జిల్లాలోని మరికొన్ని ప్రాజెక్టులలోని మారుమూల అంగన్వాడీ కేంద్రాల్లోనూ ఇదే రకమైన పరిస్థితులున్నాయి. జిల్లాలోని 11 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో పనిచేస్తున్న 2060అంగన్వాడీ సెంటర్లకు ప్రతి నెలలో రెండుసార్లు నాణ్యమైన కోడిగుడ్లు సరఫరా చేయాల్సి ఉంది. జిల్లాలో 2060 అంగన్వాడీ సెంటర్లలో పౌష్టికాహారం తీసుకునేందుకు నమోదై ఉన్న దాదాపు 80 వేల మంది చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారంలో ప్రతిరోజూ కోడిగుడ్లను అందించాల్సి ఉంది. ఈ లెక్కన నెలకు దాదాపు 18లక్షల వరకు కోడి గుడ్లు లబ్దిదారులకు అందించాల్సి ఉంటుంది. కానీ పలు రకాల కారణాలతో గైర్హాజరయ్యే లబ్దిదారుల సంఖ్య తీసివేస్తే సగటున నెలకు 12 లక్షల – సుంచి 15 లక్షల కోడిగుడ్లు అంగనీవాడీ కేంద్రాల్లో లబ్దిదారులకు అందించాల్సి ఉంది. అంటే ప్రతినెలా ప్రభుత్వం ఒక్క కోడిగుడ్ల కోసమే ఈ జిల్లాలోనే దాదాపు రూ.60 లక్షల నుంచి రూ.75 లక్షల దాకా ఖర్చు చేయాల్సి ఉంది.ఈ లెక్కన ఏడాదికి సగటున రూ.7కోట్ల నుంచి రూ.9కోట్ల వరకు విలువైన కోడిగుడ్లు సరఖరా కావాల్సి ఉంది. ఇంత భారీమొత్తంలో విలువైన ఈ కోడిగుడ్ల సరఖరాపై కన్నేసిన కాంట్రాక్టర్లు, పోటీలు పడి మరీ ఈ టెండర్లలో హక్కులు దక్కించుకుంటున్నారు. ఆ తర్వాత కాసుల కక్కుర్తితో నాసిరకం కోడిగుడ్లు సరఫరా చేసేందుకూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దుస్థితిలో జిల్లాలో పలు అంగన్వాడీ సెంటర్లకు నాసిరకమైన కోడిగుడ్లు సరఫరా అవుతున్నాయి. తమ తమ సెంటర్లలో అవసరమైన కోడిగుడ్ల కోసం “ఇండెంట్” పెడుతున్న అంగన్వాడీ టీచర్లలో పలువురు తమకు వచ్చిన కోడిగుడ్లలో కూడా అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటివరకు తీవ్రమైన ఆక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వచ్చిన పాల్వంచ ఐసీడీఎస్ ప్రాజెక్టులో ఓ అధికారిపై చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు మరో సీడీపీఓకు బాధ్యతలు అప్పగించారు. దీంతో అస్తవ్యస్త పరిస్థితులు ఒక్కొక్కటిగా సరిచేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆదాయం, ఆక్రమార్జనలపై అత్యాశతో అక్రమాలకు పాల్పడుతున్న కోడిగుడ్ల కాంట్రాక్టర్లకు ‘చెక్’ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలోనూ ఇవే రకమైన ఆరోపణలు రావడంతో జిల్లాలో కొందరు కోడి గుడ్ల కాంట్రాక్టర్లపై చర్యలు చేపట్టారు. ఈ విషయంలో కొందరు అధికారులు, సిబ్బంది క్రమశిక్షణ చర్యలకు గురయ్యారు. ఈ పరిస్థితుల్లో ఇటీవల మళ్లీ గాడితప్పి జిల్లాలో కోడిగుడ్ల సరఫరాలో అక్రమాలు జరుగుతున్న ఐసీడీఎస్ పని తీరు చక్కదిద్దేందుకు రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులు మళ్లీ కఠినచర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.

ఈ విషయంపై ‘దివిటీ మీడియా’ పాల్వంచ సీడీపీఓ రేవతిని వివరణ కోరగా, తాను ఇటీవలే బాధ్యతలు చేపట్టానని తెలిపారు. పరిస్థితులను పరిశీలించి తన ఉన్నతాధికారులకు నివేదిస్తానని ఆమె వివరించారు.

విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం : జిల్లా సంక్షేమాధికారి విజేత

జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు నాసిరకం కోడిగుడ్లు సరఫరా అవుతున్న విషయం తనకు తెలియదని, ఈ విషయంపై విచారణ జరిపి, బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా సంక్షేమాధికారి విజేత ‘దివిటీ మీడియా’కు వివరించారు. బాధ్యులుగా తేలిన కాంట్రాక్టర్లను ‘బ్లాక్ లిస్టు’లో పెడతామన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పండుగ పూట పారిశుద్ధ్యలోపం…

Divitimedia

పెహల్గాంలో ఉగ్రదాడిని ఖండించిన మస్జిదే దావత్

Divitimedia

రాజకీయాలకతీతంగా ప్రజాసేవ : ఎంపీ రఘురాంరెడ్డి

Divitimedia

Leave a Comment