మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు, మరో కొరియర్ అరెస్ట్
వివరాలు వెల్లడించిన ఎస్పీ రోహిత్ రాజు
✍️ దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 28
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు, సీఆర్పీఎఫ్ పోలీసులు ఓ మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడిని, మరో కొరియర్ ను అరెస్టు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు గురువారం వివరాలు వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం… మార్చి 27వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు, సీఆర్పీఎఫ్ 151బెటాలియన్, 204బెటాలియన్ కోబ్రా పోలీసులు దుమ్ముగూడెం మండలంలోని ములకనపల్లి అటవీ ప్రాంతంలో సంయుక్తంగా నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్లో వారు పట్టుబడ్డారు. నిషేధిత మావోయిస్టు పార్టీ కిష్టారం ఎల్ఓఎస్ డిప్యూటీ కమాండర్ పుట్టం మున్నా, జాడి పెద్దబ్బాయి అనే మావోయిస్టు కొరియర్ ను అరెస్టు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీసుస్టేషన్ పరిధిలోని పూస్నార్ గ్రామానికి చెందిన పుట్టం మున్నా అలియాస్ సన్నాల్ కిష్టారం ఎల్ఓఎస్ దళం డిప్యూటీ కమాండర్ గా పనిచేస్తున్నట్లు వివరించారు. ములుగు జిల్లా, వెంకటాపురం మండలం, ఉప్పేడు వీరాపురం గ్రామానికి చెందిన జాడి పెద్దబ్బాయి, మావోయిస్టు పార్టీ కొరియర్ గా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. పుట్టం మున్నా@సన్నాల్ 2004 నుంచి నిషేధిత మావోయిస్టు పార్టీ ఆయుధ దళ సభ్యునిగా పనిచేస్తున్నాడని ఎస్పీ వెల్లడించారు. 2004-2006 మధ్యకాలంలో గంగలూరు ఏరియా మిలీషియా సభ్యుడిగా, 2006-2007 మధ్య కాలంలో గంగులూరు ఏరియా కమిటీ దళసభ్యునిగా, 2007-2011 మధ్యకాలంలో పామేడ్ ఏరియా కమిటీ దళసభ్యునిగా అతను పనిచేసినట్లు ప్రకటించారు. 2011-2022 మధ్యకాలంలో మడవి హిడ్మా @సంతోష్ నాయకత్వంలో మావోయిస్టు బెటాలియన్ సభ్యునిగా పనిచేసాడని, 2022 లో ఏరియా కమిటీ సభ్యుడిగా ప్రమోషన్ పొందిన పుట్టం మున్నా ఇప్పటివరకు కిష్టారం ఏరియా ఎల్ఓఎస్ డిప్యూటీ దళ కమాండర్ గా పనిచేస్తున్నాడని వివరించారు. చత్తీస్ గఢ్ రాష్ట్రంలో అతనిపైన రూ.5లక్షల రివార్డ్ ఉందని, అతను ఎస్ఎల్ఆర్ ఆయుధం కలిగి ఉండి ఇతర మావోయిస్టు దళసభ్యుల తో కలిసి అనేక విధ్వంసకర ఘటనల్లో పాల్గొన్నాడని ఎస్పీ రోహిత్ రాజు ప్రకటించారు.
ఎస్పీ ప్రకటించిన ప్రకారం మున్నా పాల్గొన్న ఘటనలు..
- 2007లో తాడిమెట్ల దగ్గర మాటువేసి 12 మంది సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి చేసి హతమార్చిన ఘటన.
- 2010లో చింతల్నార్ అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ పోలీసులపై కాల్పులు జరిపి 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను హతమార్చిన ఘటన.
- 2013 మే నెలలో కిష్టారం దగ్గర ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లను దాడి చేసి చంపిన ఘటన.
- 2014లో కాసల్పాడు దగ్గర 14 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను చంపిన ఘటన.
- 2018లో మైన్ ప్రూఫ్ వెహికల్ మీద కాల్పులు జరిపి 9 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను హతమార్చిన ఘటన.
- 2021లో జిరామ్ ఘాట్ సంఘటనలో 22 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను హతమార్చిన ఘటనలతో పాటు ఇటీవల ఏర్పాటు చేసిన ధర్మారం క్యాంప్ మీద దాడి వంటి దాడులలో ఇతను పాల్గొన్నాడు.
అరెస్టు కాబడిన మరో వ్యక్తి జాడి పెద్దబ్బాయి గత మూడు సంవత్సరాలుగా ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో 1st బెటాలియన్ మావోయిస్టులకు కొరియర్ గా పనిచేస్తున్నాడని వెల్లడించారు. అరెస్టు కాబడిన ఇద్దరు నిందితుల వద్ద నుంచి ఒక బ్యాగు, పది జిలెటిన్ స్టిక్స్, రెండు ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, మావోయిస్టు పార్టీ కరపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రోహిత్ రాజు పేర్కొన్నారు. నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సహకరిస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, అమాయకపు ఆదివాసీ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకునే వారిపై చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు హెచ్చరించారు.