Divitimedia
Bhadradri KothagudemBusinessCrime NewsEntertainmentHanamakondaHealthHyderabadInternational NewsLife StyleNational NewsPoliticsSpot NewsTechnologyTelanganaTravel And Tourism

▶ అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లపై విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లపై విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

హుస్సేన్ సాగర్ చుట్టూ దుబాయ్ మోడల్ టూరిజం స్పాట్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడి

రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండీఏ పరిధి విస్తరణకు నిర్ణయం

హెచ్ఎండీఏ స్థలాల పరిరక్షణకు ప్రత్యేక అధికారులు, కట్టుదిట్టమైన చర్యలు

లే అవుట్లలోని ప్రభుత్వ స్థలాల్లో ఆదర్శ పాఠశాలలు

✍ దివిటీ మీడియా – హైదరాబాదు, ఫిబ్రవరి 29

హైదరాబాదు అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ, దర్యాప్తు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వానికి అధికంగా రావాల్సిన ఆదాయానికి గండిపడే విధంగా తక్కువ రేటుకు టెండర్లు కట్టబెట్టిన తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి హెచ్ఎండీఏ అధికారులతో జరిపిన సమీక్ష సమావేశంలో ఈమేరకు ఆదేశించారు. ఈ వ్యవహారంపై ప్రాథమిక విచారణ తర్వాత సీబీఐకి గానీ అదేస్థాయిలో వేరే సంస్థకు గానీ పూర్తిస్థాయి దర్యాప్తు బాధ్యత అప్పగిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కనీసం రేట్లు నిర్ణయించకుండానే టెండర్లు ఎలా పిలిచారని ఆయన హెచ్ఎండీఏ అధికారులను ప్రశ్నించారు. అందులో ఎవరెవరి ప్రమేయముందో, ఏయే సంస్థలున్నాయో, దీనికి ఎవరెవరు బాధ్యులో, తదితర అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ టెండర్లలో జరిగిన అవకతవకలు, అప్పుడు అనుసరించిన విధానాలు, ఫైళ్లు కదిలిన తీరుపై పూర్తి వివరాలను సమర్పించాలని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి బాధ్యతలు అప్పగించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఫైళ్లు ఏవైనా మిస్సయినట్లు గుర్తించిన వెంటనే సంబంధిత అధికారులు, బాధ్యులైన ఉద్యోగులపై వ్యక్తిగతంగా కేసులు నమోదు చేయాలని కూడా ఆదేశించారు. ఈ వ్యవహారంపై హెచ్ఎండీఏ నుంచి పూర్తి నివేదిక అందిన తర్వాత కేబినేట్లో చర్చించి ఈ టెండర్ల వ్యవహారాన్ని సీబీఐకి గానీ, అదేస్థాయిలో ఉన్న మరో దర్యాప్తు సంస్థకు గానీ అప్పగిస్తామని సీఎం వెల్లడించారు. ఈ టెండర్లకు ముందు ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రతినెలా గరిష్టంగా వచ్చే టోల్ వసూళ్లతో ఏడాదికి రూ.600కోట్ల వరకు ఆదాయం వచ్చేదని అధికారులు సీఎంకు వివరించారు. అదేస్థాయిలో 30 ఏండ్లకు రూ.18 వేల కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదని, కేవలం రూ.7,380 కోట్లకు ఐ.ఆర్.బి కంపెనీకి ఎలా అప్పగించారనేదానిపై సీఎం ఆరా తీశారు. హెచ్ఎండీఏ అనుసరించిన ఈ టెండర్ విధానంతోనే ప్రభుత్వం రూ.15 వేల కోట్లకుపైగా నష్టపోయిందని సమీక్ష సమావేశంలో ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. హెచ్ఎండీఏ రెండు కంపెనీలతో డీపీఆర్ తయారు చేయించి, ప్రభుత్వ ఆదాయానికి నష్టం తెచ్చే డీపీఆర్ ను ఎంచుకోవడంపై చర్చకు వచ్చింది. అందుకే ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ చేయిస్తేనే, నిజాలు బయటకు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. టెండర్ దక్కించుకున్న కంపెనీ ప్రభుత్వంతో చేసుకున్న కాంట్రాక్టు అగ్రిమెంట్ ను చూపించి 49 శాతం వాటాను విదేశీ కంపెనీలకు అప్పగించిందని, విదేశీ కంపెనీతో కాంట్రాక్టు సంస్థ చేసుకున్న ఒప్పంద లావాదేవీలపై కూడా దర్యాప్తు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

అవుటర్ రింగ్ రోడ్డు లోపలవైపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్ గా తీసుకుని హైదరాబాద్ నగరం అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్రమంగా రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండీఏ పరిధిని విస్తరించాలని సూచించారు. అవుటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా రేడియల్ రోడ్లు నిర్మించాలని చెప్పారు. మాస్టర్ ప్లాన్- 2050కి అనుగుణంగా ప్రత్యేక కన్సల్టెన్సీతో సిటీ అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని సీఎం సూచించారు.

హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులు, కుంటలను పరిరక్షించాలని, మరోవైపు ల్యాండ్ ఫూలింగ్ ను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. దీనికి అవసరమైతే ల్యాండ్ ఫూలింగ్, అక్కడి స్థలాల అభివృద్ధి విషయంలో జిల్లా కలెక్టర్ల సహకారం తీసుకోవాలని, సమన్వయంతో పని చేయాలని సూచించారు. హెచ్ఎండీఏ పరిధిలో దాదాపు 8,374 ఎకరాల ల్యాండ్ పార్శిళ్లు ఉన్నాయని, వీటిలో 2031 పార్శిళ్లు వివిధ స్థాయిల్లో కోర్టు కేసులలో ఉన్నాయని, హెచ్ఎండీఏ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని, డిజిటల్, జీపీఎస్ విధానాలతో ఎక్కడ ఎంత స్థలముందో మ్యాపింగ్ చేయాలని సీఎం సూచించారు. తమ పరిధిలో ఉన్న స్థలాలతో హెచ్ఎండీఏ ఆదాయం పెంచుకునే చర్యలు చేపట్టాలన్నారు. ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. ల్యాండ్ ఫూలింగ్, ల్యాండ్ పార్శిల్స్, చెరువులు, కుంటలు ఆక్రమణకు గురవకుండా చూసేందుకు ప్రత్యేక అధికారులను నియమించే అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. డీఐజీ స్థాయిలో ఒక ఐపీఎస్ అధికారి, ఇద్దరు ఎస్పీ ర్యాంకు అధికారులకు బాధ్యతలు అప్పగించాలని సీఎం సూచించారు.

హైదరాబాద్ తో పాటు వరంగల్, కరీంనగర్ తదితర పట్టణాల్లో లే అవుట్లలో కమ్యూనిటీ అవసరాలకు ఇచ్చిన స్థలాల ఆక్రమణలు గుర్తించే సర్వే వెంటనే చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ స్థలాల్లో ఆదర్శ పాఠశాలలు ఏర్పాటుకు ముందుకొచ్చే కార్పేరేట్ కంపెనీలు, పేరొందిన పాఠశాలల యాజమాన్యాలకు వీటిని అప్పగించాలని సూచించారు. ఆ ప్రాంతంలోని పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు కనీసం 25 శాతం కోటాగా ఉచితంగా అడ్మిషన్లు ఉండేలా చూడాలని, దీంతో అన్ని ప్రాంతాల్లో ఆదర్శ పాఠశాలలు అందుబాటులోకి వస్తాయని సీఎం అభిప్రాయపడ్డారు.

హుస్సేన్ సాగర్ సమీపంలోని పరిసర ప్రాంతాలను ఆహ్లాదకరంగా ఉండే జోనుగా తీర్చిదిద్దాలని సీఎం అధికారులకు సూచించారు. అంబేద్కర్ విగ్రహం, ఎన్టీఆర్ పార్కు, తెలంగాణ అమరులజ్యోతి, నెక్లెస్ రోడ్డు నుంచి ఇందిరా పార్కు, సంజీవయ్య పార్కు వరకు మొత్తాన్ని ప్రపంచ స్థాయి సందర్శనీయమైన ప్రాంగణంగా తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. హుస్సేన్ సాగర్ ఆక్రమణలను తొలిగించి, పర్యాటకులు, సిటీ ప్రజలు తీరికవేళలో ఆనందంగా గడిపేలా రూపొందించాలని సీఎం అధికారులకు వివరించారు. దుబాయ్ తరహాలో స్కై వాక్ వే, ఫుడ్ స్టాళ్లు, చిల్డ్రన్ అమ్యూజ్మెంట్ జోన్, గ్రీనరీ ల్యాండ్ స్కేప్స్ అభివృద్ధి చేయాలని సూచించారు. అవసరమైతే అక్కడ రాకపోకలను మరో రూటుకు మళ్లించి, పర్యాటక జోనుగా మార్చాలని సూచించారు. వెంటనే అంతర్జాతీయ స్థాయి కన్సెల్టెన్సీలతో ఈ ప్రాజెక్టు నమూనాలు తయారు చేయాలని సీఎం సూచించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రాపాలితో పాటు అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

Divitimedia

పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రతతో ఆరోగ్యంగా ఎదగాలి

Divitimedia

ఆదర్శం… ఆ అధికారి వ్యక్తిత్వం

Divitimedia

Leave a Comment