Divitimedia
Bhadradri KothagudemHyderabadLife StyleSpot NewsTelangana

మూడు గంటలు ప్రచారం… మూడు నిమిషాల గ్రామసభ…

మూడు గంటలు ప్రచారం… మూడు నిమిషాల గ్రామసభ…

ఆరంభంలోనే అధికారుల అలసత్వం…

✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు, ఫిబ్రవరి 7

సర్పంచుల పదవీవిరమణ తర్వాత తమదైన ముద్రతో పాలన కొనసాగించాల్సిన ‘ప్రత్యేక’ అధికారులు ఆదిలోనే అలసత్వం ప్రదర్శిస్తున్నారు. రాజకీయాలకతీతంగా తమ సమస్యలు పరిష్కరిస్తారని ఆశ పెట్టుకున్న ప్రజలకు తీవ్ర నిరాశ కలిగిస్తున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని మోరంపల్లిబంజర గ్రామపంచాయతీ పని తీరు. దాదాపు 6000కు పైగా జనాభా ఉన్న ఈ గ్రామ పంచాయతీలో బుధవారం (ఫిబ్రవరి 7) గ్రామసభ ఏర్పాటు చేశారు. ఈ గ్రామసభకు గ్రామస్థులంతా హాజరు కావాలని కోరుతూ, మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు మూడు గంటలపాటు గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ బుధవారం గ్రామసభ నిర్వహణ తీరు చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. ఉదయం 10గంటలకు గ్రామసభ నిర్వహణ ఉంటుందని ప్రకటించినప్పటికీ 11గంటలకు కూడా జనం రాకపోవడం వల్ల ఆరంభించలేదు. అప్పటికే వచ్చిన స్థానికులకు ఇక్కడ ప్రత్యేకాధికారిగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీఓ వివేక్ రామ్, వీడియో కాన్ఫరెన్సులో బిజీగా ఉండటం వల్ల రాలేదని చెప్పారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఓ పావుగంట వ్యవధిలో ‘గ్రామసభ’ నిర్వహించారు. అయితే హాజరైన దాదాపు 25మందిలో పద్దెనిమిది మంది పారిశుద్ధ్య కార్మికులుండటం విశేషం. మిగిలిన వారిలో కూడా ముగ్గురు అంగన్ వాడీ టీచర్లే ఉన్నారు. వీరందరినీ పక్కన పెడితే ఈ గ్రామసభకు హాజరైన వారు కేవలం ఐదుగురు. ఆ ఐదుగురితోనే గ్రామ పంచాయతీ కార్యదర్శి ముచ్చటగా మూడు నిమిషాలలోనే ‘మమ’ అనిపించారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు ఇకనుంచి సెలవు లేకుండా పనిచేయాల్సి ఉంటుందనే విషయాన్ని ప్రకటించిన వెంటనే గ్రామసభ ముగించేయడం గమనార్హం. ఇంత విచిత్రంగా ఈ గ్రామ పంచాయతీలో గ్రామసభ నిర్వహించిన ఉదంతాలు గతంలో ఎన్నడూ లేవని స్థానికులు ఆవేదన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి ‘దివిటీ మీడియా’ ప్రతినిధి బూర్గంపాడు ఎంపీడీఓ వివేక్ రామ్ ను వివరణ కోరగా, వీడియో కాన్ఫరెన్సు ముగిసిన తర్వాత తాను వచ్చి మళ్లీ పక్కాగా ‘గ్రామసభ’ నిర్వహిస్తానని హామీ ఇచ్చారు.


కొసమెరుపు


బూర్గంపాడు మండలం మోరంపల్లిబంజర గ్రామ పంచాయతీలో గ్రామసభ ఉదయం కేవలం నిమిషాల వ్యవధిలో ముగించగా, ఆ తర్వాత ‘దివిటీ మీడియా’ చొరవతో వచ్చిన ఎంపీడీఓ వివేక్ రామ్ మరోసారి గ్రామసభ పేరుతో హడావిడి చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం పక్కనే ఉన్న వీధిలో పర్యటించిన ఆయన దాదాపు ఓ పదిహేను మంది స్థానికులను పంచాయతీ కార్యాలయానికి తీసుకొచ్చి మరోసారి గ్రామసభ నిర్వహించడం తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. తూతూమంత్రంగా జరిగిన గ్రామసభను మరలా అదే రీతిలో నిర్వహించడం కొసమెరుపు…

Related posts

నూతన క్రిమినల్ చట్టాలపై చర్చించిన సదస్సు

Divitimedia

ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ మంజూరు చేయించండి

Divitimedia

పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు నిధులు మంజూరు

Divitimedia

Leave a Comment