Divitimedia
EducationHyderabadInternational NewsLife StyleNational NewsPoliticsTechnologyTelanganaYouth

త్వరలో రాష్ట్రంలో కుల గణన

త్వరలో రాష్ట్రంలో కుల గణన

ప్రతి నియోజకవర్గానికొక ఇంటిగ్రేటేడ్ ఎడ్యుకేషన్ హబ్

గురుకులాలకు సొంత భవనాలకోసం స్థలాల గుర్తింపు

విద్యార్థులకు మరింత ప్రయోజనకరమైన పథకాలు

బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ విభాగాల సమీక్షలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి

✍🏽 దివిటీ మీడియా – హైదరాబాదు, జనవరి 27

త్వరలోనే రాష్ట్రంలో కులగణన చేపడుతామని, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయన శనివారం సచివాలయంలో బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ విభాగాలపై నిర్మువహించిన సమీక్షలో కులగణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అద్దెభవనాల్లో ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని, వాటికి సొంత భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, యుద్ధ ప్రాతిపదికన భవనాల నిర్మాణానికి సరిపడే స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఒక్కొక్క స్కూల్ నిర్మాణానికి బడ్జెట్ అంచనా వేసి ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు.

ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ఇచ్చే డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు, వంట బిల్లులు పెండింగ్ లేకుండా చూడాలని, గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లింపులు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

మహాత్మ జ్యోతిభాపూలే ఓవర్సీస్ స్కాలర్ షిప్ స్కీమ్ ను మరింత సమర్థంగా అమలు చేయాలని, ఇప్పుడున్న లబ్ధిదారులకంటే ఎక్కువమంది అర్హులైన విద్యార్థులకు మేలు జరిగేలా చూడాలన్నారు. విదేశాల్లోని యూనివర్సిటీల ర్యాంకింగ్ ల ఆధారంగా టాప్ యూనివర్సిటీలను గుర్తించి ఫ్రేమ్ వర్క్ తయారు చేయాలని, వాటిలో చదివేందుకు వెళ్లే విద్యార్థులకు ఈ స్కీమ్ లో మొదటి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థలన్నీ వేర్వేరు చోట్ల విడివిడిగా కాకుండా ‘ఇంటిగ్రేటేడ్ ఎడ్యుకేషన్ హబ్’ ఏర్పాటు చేయాలని సీఎం అన్నారు. నియోజకవర్గానికొక ఇంటిగ్రేటేడ్ ఎడ్యుకేషన్ హబ్ నిర్మించే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. దీనివల్ల స్కూళ్ల నిర్వహణ, పర్యవేక్షణ, అజమాయిషీ కూడా మరింత మెరుగ్గా చేసే వీలుంటుందన్నారు. ఎక్కువమంది విద్యార్థులు ఒకే ప్రాంగణంలో చదువు కోవటం ద్వారా వారిలో ప్రతిభాపాఠవాలు, పోటీతత్వం పెరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. వెంటనే అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎడ్యుకేషన్ హబ్ ల నిర్మాణానికి సరిపడే స్థలాలను గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నియోజకవర్గ కేంద్రంలో వీలు కాకుంటే ప్రత్యామ్నాయంగా అదే సెగ్మెంట్లో మరో పట్టణం గానీ మండలకేంద్రాలను గానీ ఎంచుకోవాలని సూచించారు. ఇప్పటికే 20ఎకరాల పైగా విస్తీర్ణమున్న స్కూల్ ప్రాంగణాల్లో మిగతా భవనాలు నిర్మించి హబ్ గా తీర్చిదిద్దే అవకాశాలుంటే పరిశీలించాలన్నారు.

ఎడ్యుకేషన్ హబ్ ల నిర్మాణానికి కార్పొరేట్ సంస్థలు, కంపెనీల సహకారం తీసుకోవాలని సీఎం అన్నారు. సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) నిధులు సమీకరించాలని, ముందుకు వచ్చే దాతల నుంచి విరాళాలు కూడా స్వీకరించి ఈ భవన నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు ఇచ్చే దుప్పట్లు, నోట్ బుక్స్, యూనిఫామ్స్, పుస్తకాలకు కూడా సీఎస్ఆర్ ద్వారా నిధులు సమీకరించాలని సూచించారు.

కళ్యాణమస్తు, షాదీ ముబారక్ లబ్ధిదారులకు నగదుతోపాటు తులం బంగారం అందించేందుకు బడ్జెట్ అంచనాలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పుడున్న బీసీ స్టడీ సర్కిళ్లను ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం యూనిట్ గా ఏర్పాటు చేసే అంశంపై అధ్యయనం చేయాలన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత శాఖల అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఎన్నికల సామగ్రి తరలింపులో ఇబ్బందులు లేకుండా చూడాలి

Divitimedia

మత్తు పదార్థాల నివారణకు జిల్లా పోలీసుల చర్యలు

Divitimedia

ఏసీబీకి పట్టుబడిన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్

Divitimedia

Leave a Comment