విద్యార్థి అమరవీరుల సంస్మరణ సభలు జయప్రదం చేయండి
పి.డి.ఎస్.యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహారావు
✍🏽 దివిటీ మీడియా – హన్మకొండ
విద్యారంగ పరిరక్షణ, విద్యార్థుల హక్కుల కోసం, శాస్త్రీయ విద్యాసాధన కోసం విప్లవ విద్యార్థి ఉద్యమ నిర్మాణంలో పనిచేస్తూ ప్రాణాలర్పించిన అమరవీరుల సంస్మరణ సభలు జయప్రదం చేయాలని పి.డి.ఎస్.యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నర్సింహరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం (నవంబరు 4) కాకతీయ యూనివర్సిటీ మొదటిగేటు ముందు పి.డి.ఎస్.యు. ఆధ్వర్యంలో “విద్యార్థి అమరవీరుల సంస్మరణ సభల” వాల్ పోస్టర్లు, కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా నర్సింహరావు మాట్లాడుతూ, రాజ్యహింసకు, శత్రుదాడులకు, బూటకపు ఎన్ కౌంటర్లకు అమూల్యమైన ప్రాణాలను బలిదానం చేసిన జార్జిరెడ్డి, జంపాల చంద్ర శేఖరప్రసాద్, శ్రీపాద శ్రీహరి, కోలా శంకర్, దుస్సా చేరాలు, రంగవల్లి, మారోజు వీరన్న లాంటి విప్లవ విద్యార్థి వీరుల సంస్మరణ సభలను నవంబర్ 5 నుండి 11 వరకు విద్యాసంస్థల్లో విస్తృతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. 76సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పేదవర్గాలకు ఉచితంగా నాణ్యమైన విద్యనందించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని తెలిపారు. విద్యారంగంలో ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాలకు అనుకూల సంస్కరణలు తీసుకువస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ విద్యార్థులను ఉన్నతవిద్యకు దూరం చేసే కుట్రలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యారంగాభివృద్ధి, విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా విద్యార్థి అమరవీరుల స్ఫూర్తితో నేటి విద్యార్థిలోకం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. విద్యాసంస్థల్లో, గ్రామీణ ప్రాంతాల్లో నవంబర్ 5 నుండి 11 వరకు విప్లవ విద్యార్థి అమరవీరుల సంస్మరణ సభలు విస్తృతంగా జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు. ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు అలువాల నరేష్, జిల్లా కమిటీ సభ్యులు అశోక్, వినయ్, ప్రవీణ్, సంగీత, కావేరి, కిరణ్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.