నిరంతరం పర్యవేక్షణతో పెయిడ్ న్యూస్ గుర్తించాలి
ఎన్నికల పరిశీలకుడు సంజీబ్ కుమార్ పాల్ ఆదేశాలు
✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
నిరంతర పర్యవేక్షణ ద్వారా పెయిడ్ న్యూస్ గుర్తించాలని ఎన్నికల పరిశీలకుడు సంజిబ్ కుమార్ పాల్ ఆదేశించారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ఎంసీఎంసీ కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు వివిధ దినపత్రికలు, శాటిలైట్ ఛానల్స్, కేబుల్, సిటీకేబుల్, అన్ని రకాల సోషల్ మీడియా లలో ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల ప్రచారాంశాలు నిరంతర పరిశీలించాలని చెప్పారు. గుర్తించిన ‘పెయిడ్ న్యూస్’ పై సంబంధిత నియజకవర్గాల రిటర్నింగ్ అధికారుల ద్వారా అభ్యర్థులకు నోటీసులు జారీ చేయాలని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు పెయిడ్ న్యూస్, ప్రకటనలపై నిరంతర పటిష్ఠమైన పరిశీలన చేయాలని ఆదేశించారు. గుర్తించిన పెయిడ్ న్యూస్, ప్రకటనలపై ఎంసీఎంసీ ప్రతిరోజు పరిశీలన చేయాలని చెప్పారు. గుర్తించిన న్యూస్ ఆధారంగా అభ్యర్థుల ఎన్నికలఖాతాకు ఆ ఖర్చు జోడించాలని ఆయన సూచించారు. జిల్లాలో చెక్ పోస్టుల వద్ద కొనసాగుతున్న పర్యవేక్షణ, సీసీ కెమెరాల రికార్డింగ్ తీరు పరిశీలించారు. సి-విజిల్ యాప్ తరపున వచ్చిన ఫిర్యాదులు, వాటి పరిష్కారాలు, ఎస్ఎస్, ఎఫ్ఎస్టీ టీముల పనితీరు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సంఘం ఇచ్చిన నియమావళి మేరకు పోటీ చేసే అభ్యర్థులు రూ.40లక్షల వరకు ఖర్చుచేసుకునేందుకు అవకాశమున్నందున వారు తప్పని సరిగా ప్రత్యేకంగా ప్రారంభించిన బ్యాంక్ ఖాతా నుంచి మాత్రమే చెల్లింపులు జరగాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంసీఎంసీ నోడల్ అధికారి, డీపీఆర్ఓ శ్రీనివాసరావు, వ్యయ నోడల్ అధికారులు వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరెడ్డి, మైనార్టీ సంక్షేమ అధికారి సంజీవరావు, తదితరులు పాల్గొన్నారు.