ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలిరోజు ఎనిమిది మంది నామినేషన్లు
నామినేషన్ దాఖలు చేసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
✍🏽 దివిటీ మీడియా – ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేసే తొలిరోజైన శుక్రవారం (నవంబరు 3వ తేదీ)
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం ఎనిమిది మంది తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఖమ్మంలో రాష్ట్ర మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్రంలోనే మొట్టమొదటి అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలుచేశారు. రాష్ట్ర స్థాయిలో కీలకనేతగా ఉన్న ఆయన ఎలాంటి హడావుడి లేకుండా నామినేషన్ దాఖలు చేయడం విశేషం. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో తొలి రోజైన శుక్రవారం ఖమ్మం అర్బన్ మండలం గొల్లగూడెంకు చెందిన రాష్ట్ర మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఖమ్మంలోని బుర్హాన్ పురం ప్ర్రాంతానికి చెందిన కాటేపల్లి శైలజ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఖమ్మంలోని శ్రీరాంనగర్ ప్రాంతానికి చెందిన కొంకిమళ్ల రవికుమార్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా పసుమర్తి శ్రీనివాస్, స్వతంత్ర అభ్యర్థిగా ఎదురుగట్ల చిట్టిమల్లు నామినేషన్లు దాఖలు చేశారు.
————————-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో…
————————-
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియలో తొలి రోజైన శుక్రవారం (నవంబరు 3వ తేదీ) కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇద్దరు, ఇల్లందు అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకరు తమ నామినేషన్లు దాఖలు చేశారు. కొత్తగూడెం నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలుస్తున్న కూలీలైన్ ప్రాంతానికి చెందిన ఇమంది ఉదయ్ కుమార్, సంజయ్ నగర్ ప్రాంతానికి చెందిన గుండపనేని సతీష్ తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఇమంది ఉదయ్ కుమార్ ఓ జర్నలిస్టు యూనియన్ కు జిల్లా అధ్యక్షుడిగా, మరో వైపు సామాజికకార్యకర్తగా పనిచేస్తున్నారు. గుండపనేని సతీష్ దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా, ఓ సామాజిక కార్యకర్తగా పని చేస్తున్నారు. జిల్లాలోని ఇల్లందు నియోజకవర్గంలోనూ స్వతంత్ర అభ్యర్థిగా కామేపల్లి మండలం మద్దులపల్లి గ్రామానికి చెందిన పోలెబోయిన రవి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఓ కమ్యూనిస్టు పార్టీలో పని చేస్తున్నారు. జిల్లాలోని అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో తొలిరోజైన శుక్రవారం ఎవరూ నామినేషన్లు వేయలేదు.




