నామినేషన్ల ప్రక్రియ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్
✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీఎన్నికల్లో భాగంగా నవంబరు 3వ తేదీనుంచి జరిగే నామినేషన్ల ప్రక్రియకు రిటర్నింగ్ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంకఅల తెలిపారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో అమె నామినేషన్ల ప్రక్రియ నిర్వహణ, జాగ్రత్తలపై రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 3నుంచి 10వ తేదీవరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల మధ్య నామినేషన్లు స్వీకరించాలని చెప్పారు. ఈ నెల 5వ తేదీ ఆదివారం సెలవు కావడంతో నామినేషన్లు స్వీకరించబడవని చెప్పారు. ఒకే రోజు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు వస్తే టోకెన్లు జారీ చేసి క్రమసంఖ్య ప్రకారం నామినేషన్లు స్వీకరించాలని చెప్పారు. ముహూర్తాలు బాగున్నాయనే ఆ రోజుల్లో అధికసంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లదాఖలు కోసం వచ్చే అవకాశం ఉన్నందున తదనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. నామినేషన్ ప్రక్రియ గురించి అవగాహన, సలహాలు, సూచనలిచ్చేందుకు రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేయాలని చెప్పారు. నామినేషన్ల ప్రక్రియకు ఎన్నికలసంఘం జారీచేసిన మార్గదర్శకాలు తు.చ.తప్పక పాటించాలని చెప్పారు. తమ నామినేషన్ దాఖలు చేసేందుకు అభ్యర్థితో పాటు మరో నలుగురు వ్యక్తులను, మూడు వాహనాలను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఆన్లైన్ ద్వారా నామినేషన్ వేసేందుకు కూడా అవకాశం ఉందన్నారు. జనరల్, బీసీ అభ్యర్థులు రూ.10 వేలు, రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు రూ.5 వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. రిజర్వుడ్ అభ్యర్థులు తమ కుల ధ్రువీకరణ పత్రం అందచేయాలని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ ఓటు ఉన్నవారైనా, ఎక్కడైనా పోటీ చేయడానికి అవకాశం ఉందని, కానీ వారిని బలపరిచే వ్యక్తులు మాత్రం పోటీ చేస్తున్న నియోజకవర్గానికి చెందినవారై ఉండాలని చెప్పారు. వేరే ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు ఆయా మండలాల తహసిల్దారుల ద్వారా పొందిన ధ్రువీకరణ అందజేయాలని చెప్పారు. నామినేషన్ లో అసంపూర్తిగా ఉన్న అంశాలపై అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు నోటీసులు జారీ చేయాలని చెప్పారు. నామినేషన్లవివరాలు, నామినేషన్లు దాఖలుచేసిన తేదీ, సమయం తప్పనిసరిగా రిజిస్టరులో నమోదు చేయాలని చెప్పారు. ఆర్ఓ కార్యాలయాల్లో ఓటరు జాబితా, చెక్ లిస్టు అందుబాటులో ఉండాలని చెప్పారు. ఆర్ఓ నిషిత పరిశీలన తర్వాత నామినేషన్ పత్రాలపై ధృవీకరణ చేయాలని చెప్పారు. ప్రతిరోజు నామినేషన్ల దాఖలు వివరాలపై ఆర్ఓలు నివేదికలు అందజేయాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే ఇబ్బంది రాకుండా ప్రత్యామ్నయ విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. నామినేషన్ల వివరాలు ప్రతిరోజు నోటీసుబోర్డులో పెట్టాలని కలెక్టర్ చెప్పారు. ఈ సందర్భంగా ఆమె నామినేషన్ పత్రాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పవర్ పాయింట్ ద్వారా అవగాహన కల్పించారు.
ఈ సమావేశంలో నియోజకర్గాల రిటర్నింగ్ అధికారులు ప్రతీక్ జైన్, రాంబాబు, శిరీష, కార్తిక్, మంగీలాల్, జిల్లా ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు దారా ప్రసాద్, డీటీ రంగ ప్రసాద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.