నర్సరీ నిర్వాహకులు నియమ నిబంధనలు పాటించాలి
రాష్ట్ర ఉద్యానవనశాఖ డీడీ భాగ్యలక్ష్మి, ఏడీ సువర్ణ ఆదేశాలు
✍🏽 దివిటీ మీడియా
నర్సరీల నిర్వాహకులు ‘నర్సరీ చట్టం ప్రకారం నియమ నిబంధనలు పాటించాలని రాష్ట్ర ఉద్యానవనశాఖ ఉప సంచాలకులు (డీడీ) పి.వి.భాగ్యలక్ష్మి, సహాయ సంచాలకులు (ఏడీ) జి.సువర్ణ ఆదేశాలు ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో జూలురుపాడు, సుజాతనగర్, టేకులపల్లి, తదితర మండలాల్లోని పలు నారుపెంపకం కేంద్రాలను వారు బుధవారం సందర్శించి, తనిఖీ చేసినారు. రైతులకు పేరు పొందిన రకాల నారును పెంచి ఇవ్వాలని, నర్సరీలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి నాణ్యమైన నారు పెంచాలని సూచించారు. వేపనూనె లాంటి పలు సేంద్రియ పద్ధతులు పాటించాలని నర్సరీ నిర్వాహకులకు వారు సూచనలు చేశారు. నర్సరీదారులు నర్సరీ చట్టం ప్రకారం అన్ని రిజిస్టర్లు మెయింటైన్ చేయాలని ఆదేశించారు. రైతులకు మేలు జరిగే విధంగా సకల చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమశాఖ అధికారి జినుగు మరియన్న, ఉద్యాన అధికారులు కె. సందీప్, ఆర్.శాంతిప్రియ, కార్యాలయ అధికారి ఎస్.విజయకుమార్, పలువురు నర్సరీదారులు పాల్గొన్నారు.