ఎప్పుడూ ఏదో ఒక హడావుడితో వార్తల్లో నిలిచే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాజాగా ప్రగతిభవన్ వద్ద హల్ చల్ చేశారు. సీఎం నివాసం ప్రగతిభవన్ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన పాల్ ను అక్కడి పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో కాస్త అసహనం ప్రదర్శించిన ఆయన, అక్టోబర్ 2 వ తేదీన నిర్వహించబోయే ప్రపంచ శాంతి మహాసభలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ ను ఆహ్వానించేందుకు వచ్చానని చెప్పారు.ముఖ్యమంత్రిని కలిసేందుకు అనుమతులు లేవంటూ పోలీసులు చెప్పడంతో పాల్ తన దైన స్టైల్ లో పోలీసులతో వాదించారు. ఉత్తరప్రదేశ్ నేత అఖిలేష్ యాదవ్ కు అపాయింట్మెంట్ ఇచ్చి తనకు ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు. ప్రపంచ శాంతి మహాసభ వల్ల తెలంగాణలో లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని అందుకే తాను సీఎం కేసీఆర్ ను కలిసేందుకు ప్రగతి భవన్ కు వచ్చానని కేఏ పాల్ తెలిపారు. అయినప్పటికీ పోలీసులు అనుమతించక పోవడంతో కాసేపు హడావుడి నెలకొంది. అసలే రాష్ట్రంలో ‘టెన్షన్ వాతావరణం’ నెలకొని ఉండగా, ముందస్తు అపాయింట్ మెంట్ లేకుండా కేఏ పాల్ ప్రగతి భవన్ కు వెళ్లి సీఎం కేసీఆర్ ను కలిసేందుకు విఫల యత్నం చేయడం చర్చనీయాంశమైంది.
previous post