వృద్ధురాలి హత్యకేసులో ఇద్దరు నిందితుల అరెస్టు


మీడియాకు వివరాలు వెల్లడించిన ఏసీపీ తిరుపతిరెడ్డి
✍️ దివిటీ మీడియా (ఖమ్మం)
ఖమ్మంజిల్లా తిరుమలాయపాలెం మండలపరిధిలోని పిండిప్రోలుగ్రామంలో గతనెల(జులై) 17 అర్దరాత్రి వృద్ధురాలిని హత్యచేసి ఆమె వద్దనున్న బంగారు ఆభరణాలు దోచుకుని వెళ్లిన కేసులో కూసుమంచి సర్కిల్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి కేసు వివరాలు ఆదివారం మీడియాకు వెల్లడి చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పిండిప్రోలు గ్రామ నివాసి ఐతనబోయిన ప్రశాంత్ (26), అతనికి సహకరించిన మహబూబాబాద్ జిల్లా మరిపెడబంగ్లా మండలం, బాలినిధర్మారం గ్రామానికి చెందిన సరగండ్ల మహేష్ (20) లను ఆదివారం తిరుమలాయపాలెం రోడ్డులో పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
అరెస్టు చేశామని ప్రకటించారు. అరెస్టు చేసిన నిందితుల వివరాలు వెల్లడించిన సందర్భంగా సంఘటన జరిగిన తీరును ఏసీపీ వివరించారు. ఆయన కథనం ప్రకారం… పిండిప్రోలు గ్రామంలో చికెన్ షాపు నిర్వహిస్తున్న ఐతనబోయిన ప్రశాంత్ కు మద్యం సేవించడం, ఆన్లైన్ బెట్టింగ్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో అతను తన చికెన్ షాపు సమీపంలో నివసిస్తున్న వృద్ధదంపతుల కదలికలు గమనిస్తూ, వృద్ధురాలు సుగుణ మెడలో బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించి వాటిని దోచుకోవాలని పథకం వేసుకున్నాడని తెలిపారు. ఈ క్రమంలో జులై 17వ తేదీ అర్ధరాత్రి సమయంలో, వృద్ధురాలి ఇంటికి వెళ్లిన ప్రశాంత్ ఆమె వద్ద బంగారం దోచుకునే ప్రయత్నం చేయగా ప్రతిఘటించిందని, దీంతో తన వెంట తీసుకెళ్లిన ఇనుపరాడ్డుతో ఆమెపై దాడిచేసి హత్యచేసి, ఆమె మెడలో ఉన్న బంగారు చైన్, నల్లపూసల చైన్ కు సంబంధించిన బంగారు బిళ్లలను తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడని తెలిపారు. హత్య చేసిన అనంతరం దొంగిలించిన బంగారు చైన్ ను తన వరుసకు బావమరిది అయిన సరగండ్ల మహేష్ కు ఇచ్చి బ్యాంకులో తాకట్టుపెట్టి డబ్బులు తెమ్మని చెప్పగా, మహేష్ ఆ బంగారు చైన్ ను తన పేరుతో ఖమ్మంలో ఓ బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.1.50 లక్షలు రుణం తీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైందన్నారు. ఈ కేసులో దర్యాప్తు అధికారి, కూసుమంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ సంజీవ్ ఆధ్వర్యంలో కె.జగదీష్, పి.సంతోష్, జె.నాగరాజు, హరికృష్ణ, ప్రొబేషనరీ ఎస్సై దివ్యతో ఏర్పాటైన నాలుగు ప్రత్యేక బృందాలు సమన్వయంతో దర్యాప్తు చేపట్టి ఇద్దరు నిందితులను త్వరగా అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. సిబ్బంది పూర్ణచందర్రావు, శ్రీలత, కిషన్, రాంబాబు, తొంట శ్రీనును పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. కేసుకు సంబంధించిన పలు ఇతర అంశాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

