వడ్డీలేని రుణాలతో వ్యాపార దక్షత పెరుగుతోంది

కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని, కలెక్టర్ జి.వి.పాటిల్
✍️ దివిటీ – కొత్తగూడెం (నవంబరు 25)
రాష్ట్రవ్యాప్తంగా రూ.304 కోట్ల విలువైన వడ్డీలేని రుణాలు విడుదల కావడం మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడుతుందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్పారు. ఈ మేరకు మంగళవారం కొత్తగూడెం క్లబ్ లో నిర్వహించిన మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ తోపాటు కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ, రుణాలను క్రమశిక్షణతో తిరిగి చెల్లించడం వల్ల వ్యాపార దక్షతను పెంపొందిస్తుందని, పెట్రోల్ బంకులు, బస్సులు, సోలార్ ప్లాంట్ల వంటి రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇందిరమ్మ చీరలతో మహిళల్లో కనిపించిన సంతోషం రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం, గృహ జ్యోతి, రేషన్ కార్డుల మంజూరు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల వంటి సంక్షేమ పథకాలు ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయన్నారు. కలెక్టర్ జి.వి.పాటిల్ మాట్లాడుతూ, మహిళా శక్తితో జిల్లాలో అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. జిల్లాకు మొత్తం రూ.10.74కోట్ల వడ్డీలేని రుణాలు ప్రభుత్వం మంజూరు చేసిందని వెల్లడించారు. నియోజకవర్గాల వారీగా అశ్వారావుపేటకు రూ.2.70 కోట్లు, భద్రాచలంకు రూ.1.51కోట్లు, పినపాకకు రూ.2.66కోట్లు, కొత్తగూడెంకు రూ.1.97 కోట్లు, ఇల్లందుకు రూ.1.38కోట్లు కలిపి మొత్తం 11,423 మహిళా సంఘాలకు లబ్ది చేకూరిందని వివరించారు. రుణాలు సమర్థవంతంగా వినియోగించుకుని కొత్త పరిశ్రమలు స్థాపించి మహిళలు తమ తమ కుటుంబాల ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. జిల్లా వైపు రాష్ట్ర, జాతీయస్థాయి పరిశ్రమలు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో మహిళా సంఘాలు కొత్త సాంకేతిక పద్ధతులతో ప్రయోగాత్మక యూనిట్లు మరింతగా ఏర్పాటు చేస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా జిల్లాలోని అన్ని పాఠశాలల మరమ్మతులు పూర్తి చేసామని, పాఠశాలలలో శానిటేషన్ కోసం కూడా నిధులు విడుదల చేయడం జరుగుతుందని అమ్మ ఆదర్శ కమిటీ పర్యవేక్షణలో పాఠశాలలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. ఇంటి ఆవరణలో చిన్న యూనిట్లు ఏర్పాటు చేయడం ద్వారా మహిళలు మంచి ఆదాయం ఆర్జించవచ్చని, బ్యాంకుల నుంచి అవసరమైన సహకారం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో 50 శాతం అటవీ ప్రాంతం ఉన్న నేపథ్యంలో అటవీ ఉత్పత్తుల ఆధారంగా మరిన్ని యూనిట్లు స్థాపించేందుకు మహిళలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఫర్నిచర్ తయారీ శిక్షణలో మహిళలు అధికంగా పాల్గొనడం మహిళా ప్రతిభకు సాక్ష్యమన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని, జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ చేతుల మీదుగా వడ్డీలేని రుణాల చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సహకారసంఘం అధ్యక్షుడు మండే హనుమంతరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు, కొత్తగూడెం తహసిల్దార్ పుల్లయ్య, అదనపు డీఆర్డీఓ నీలేష్, డ్వాక్రాసంఘాల సభ్యులు పాల్గొన్నారు.

