బయోచార్ తయారీ ప్రక్రియ పరిశీలించిన కలెక్టర్

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జులై 14)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జి వి పాటిల్ సోమవారం చుంచుపల్లి మండల పరిధిలోని విద్యానగర్ గ్రామపంచాయతీ డంపింగ్ యార్డులో బయోచార్ (బొగ్గు) తయారీ ప్రక్రియ పరిశీలించారు. అక్కడి వ్యర్థాల విభజన (సెగ్రిగేషన్ షెడ్)లో మట్టి, మట్టి ఇటుకలతో నిర్మించిన ‘కోన్ టిక్ కొలిమి’లో ఎండిన సర్కారు తుమ్మ, చెట్ల కొమ్మలు చిన్న చిన్న ముక్కలుగా చేసి మంట ద్వారా బయోచార్ తయారు చేసే ప్రక్రియను తిలకించారు. ఈ విధంగా తయారైన బయోచార్ (బొగ్గు)ను గోవు మూత్రం, గోవుపేడలో కొన్నిరోజులపాటు నిలువ ఉంచి, ఆరబెట్టిన తర్వాత పొడి తయారు చేసి పంటలకు సేంద్రియ ఎరువుగా వాడితే భూసారం అభివృద్ధి అవుతుందని, అధిక దిగుబడులు పొందవచ్చునని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. గ్రామపంచాయతీలు గృహాలు, షాపుల నుంచి చెత్త సేకరణ చేసేటప్పుడు తడి చెత్త, పొడి చెత్తగా వేర్వేరుగా సేకరించాలని ఆదేశించారు.
డంపింగ్ యార్డులో తయారుచేసిన కంపోస్ట్ ఎరువును కూడా జిల్లాకలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సుభాషిని, డీఎల్పీఓ ప్రభాకర్ రావు, ఎంపీఓ సత్యనారాయణ, డీఆర్డీఏ ఈడీ రాజు, ఎంఈఓ రాజేశ్వరి, ఏఈఓ మమత, తదితరులు పాల్గొన్నారు.
–‐—————-
మల్బరీ సాగును పరిశీలించిన జిల్లా కలెక్టర్
-‐———‐—-‐—
జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ సోమవారం పాల్వంచ మండలం శ్రీనివాసనగర్ గ్రామంలో కాటమనేని విజయలక్ష్మి అనే రైతుకు చెందిన మల్బరీ సాగు తీరును పరిశీలించారు. మల్బరీ సాగు, పట్టు పురుగులు పెంచుకునేందుకుగాను గది నిర్మాణంపై చుట్టుపక్కల రైతులకు అవగాహన కల్పించారు. మల్బరీ సాగు వల్ల కలిగే ప్రయోజనాలు, లాభాలు, ప్రభుత్వ రాయితీలు వంటి అంశాలు రైతులతో ముచ్చటించారు. కార్యక్రమంలో ఉద్యానవన పట్టుపరిశ్రమ శాఖ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఉప సంచాలకుడు ముత్యాలు, జిల్లా అధికారి జె.కిషోర్, సహయ అధికారి డి.రామయ్య, రైతులు పాల్గొన్నారు.