Divitimedia
Bhadradri KothagudemCrime NewsLife StyleNational NewsSpot NewsTechnologyTelanganaYouth

గంజాయి కేసులో నిందితుడి ఆస్తులు జప్తుచేసిన పోలీసులు

గంజాయి కేసులో నిందితుడి ఆస్తులు జప్తుచేసిన పోలీసులు

నిందితుడి ఆస్తుల జప్తునకు కృషిచేసిన సీఐ ఇంద్రసేనారెడ్డి

సీఐ, పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (మార్చి 26)

గంజాయి అక్రమ రవాణాచేస్తూ, ఆస్తులు సంపాదించాడనే కారణాలు చూపిస్తూ, పోలీసులు ఓ నిందితుడి ఆస్తులు జప్తు చేశారు. ఈ జప్తు విషయంలో కృషిచేసిన జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డితో పాటు పోలీసులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అభినందనలు తెలిపారు. ఈ ఉదంతంపై ఎస్పీ రోహిత్ రాజు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. బూర్గంపాడు మండలం సారపాక గ్రామ శివారు కోయగూడెం గ్రామ పంచాయతీకి చెందిన దుగ్గెంపూడి శివశంకర్ రెడ్డి, అదే సారపాక మసీదురోడ్డుకు చెందిన కారు డ్రైవర్ నాగేంద్రబాబు, ఇద్దరూ కలిసి నిషేధిత గంజాయి అక్రమరవాణా చేస్తూ 2024 సెప్టెంబరు 8న జూలూరుపాడు పోలీసులకు పట్టుబడ్డారు. వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ నిమిత్తం కొత్తగూడెం కోర్టులో హాజరు పరిచారు. కేసులో ప్రధాన నిందితుడైన దుగ్గంపూడి శివశంకర్ రెడ్డి గంజాయి ద్వారా సంపాదించిన డబ్బులతో తన తండ్రి దుగ్గంపూడి వెంకటరెడ్డి పేరుమీద కోయగూడెం గ్రామపంచాయతీలో ఇల్లు కట్టించాడని పోలీసులు పేర్కొన్నారు. ఆ నిందితుడు శివశంకర్ రెడ్డి, తన తల్లి దుగ్గెంపూడి యశోద పేరుమీద ఇన్నోవా కారు కూడా కొనుగోలు చేసినట్లు వారు వెల్లడించారు. అతను హైదరాబాదులో కె.పి.హెచ్.బి గోకుల్ క్రాస్ రోడ్ ఎస్బీఐ బ్రాంచ్ లో సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్లను ఓపెన్ చేసి వాటి ద్వారా లావాదేవీలను నడిపినట్లు పేర్కొన్నారు. గంజాయి అక్రమ రవాణా చేయడం వల్ల సంపాదించిన డబ్బులతో ఈ ఆస్తులను కొనుగోలు చేశాడని పేర్కొంటూ, వాటిని జప్తు చేయడానికి జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి చెన్నైలోని కాంపిటెంట్ అథారిటీ ద్వారా ఆస్తుల ఫ్రీజింగ్ ఆర్డర్ తీసుకున్నారు. దుగ్గెంపూడి శివశంకర్ రెడ్డి గంజాయి ద్వారా సంపాదించిన అక్రమ ఆస్తులు, బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసినట్లు ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు ప్రకటించారు. గంజాయి అక్రమ రవాణా చేస్తూ, పట్టుబడిన వారిని జైలుకు పంపించడమే కాకుండా వారి ఆస్తులను కూడా జప్తు చేసే విధంగా కృషి చేసిన జూలూరుపాడు సీఐ, సిబ్బందిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించారు. అక్రమార్జనే ధ్యేయంగా ప్రభుత్వ నిషేధిత గంజాయిని రవాణా చేస్తూ పట్టుబడితే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, వారి ఆస్తులను కూడా జప్తు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు.

Related posts

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఘోర రైలు ప్రమాదం

Divitimedia

రెండు కార్లలో 21 కేజీల గంజాయిని స్వాధీనం

Divitimedia

పుష్ప సినిమా నటుడు జగదీశ్ పై కేసు నమోదు, అరెస్టు

Divitimedia

Leave a Comment