Divitimedia
Bhadradri KothagudemEducationEntertainmentHanamakondaHealthHyderabadJayashankar BhupalpallyKhammamLife StyleMahabubabadMuluguNalgondaPoliticsSpot NewsSuryapetTelanganaWarangal

ఆదివాసీల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోండి

ఆదివాసీల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోండి

అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

✍️ హైదరాబాద్ – దివిటీ (జనవరి 10)

రాష్ట్రంలోని అన్ని ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆదివాసీ సంఘాలు, ప్రజాప్రతినిధులతో ఆయన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో ఆదివాసీ ప్రాంతాల స్థితిగతులపై సమీక్ష చేశారు. ఆదివాసీసంఘాల ప్రతినిధులు విద్య, ఉద్యోగావకాశాలు, రోడ్లు, సాగు, రవాణా, తాగునీరు తదితర అంశాలు, సమస్యలను సీఎంకు విన్నవించారు. ఆదివాసీల కోసం ఇప్పటికే చేపట్టిన పలు అంశాలను ప్రస్తావిస్తూ, వారు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కొమురం భీమ్ జయంతి, వర్ధంతిలను అధికారిక ఉత్సవంగా నిర్వహించాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అదేవిధంగా పలు అంశాలపై అధికారులకు ఆయన సూచనలిచ్చారు. ఐటీడీఏ ప్రాంతాలకు జనాభా ప్రాతిపదికన ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపునకు చర్యలు తీసుకోవాలన్నారు. స్పెషల్ డ్రైవ్ కింద ఇందిర జలప్రభ ద్వారా ఉచితంగా బోర్లు వేసేందుకు చర్యలు చేపట్టాలని, ఆదివాసీ రైతుల వ్యవసాయ బోర్లకు సోలార్ పంపుసెట్లు ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఆదివాసీ గూడేల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంద్రవెల్లి అమరుల స్తూపాన్ని స్మృతివనంగా మార్చాలని, అమరులకుటుంబాలకు ఇళ్లు మంజూరు చేయడం వంటి చర్యలు ఇప్పటికే తీసుకున్నామని వివరించారు. రాజకీయ పరంగాను ఆదివాసీలకు న్యాయం చేస్తూ ముందుకు వెళుతున్నామన్నారు. అలాగే ఆదివాసీలు విద్య, ఉద్యోగ,ఆర్ధికాభివృద్ధి కోసం చర్యలు చేపడుతున్నామన్నారు.
ఆదివాసీల మాతృభాషలో విద్యాబోధన, గోండు భాషలో ప్రాథమిక విద్యనందించే అంశాలపై అధ్యయనం చేసి నివేదికను అందించాలన్నారు. ఆదివాసీల కోసం ప్రత్యేక స్టడీసర్కిల్, మౌలిక సదుపాయాలను వెంటనే మంజూరు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వివరించారు. విదేశాల్లో చదువుకునే ఆదివాసీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్ షిప్పులకు సంబంధించి పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలని సీఎం ఆదేశించారు.ఇప్పటికే మంజూరైన బీఈడీ కళాశాలకు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. ఆదివాసీ రాయి సెంటర్లకు భవనాలు నిర్మించేందుకు అధ్యయనం చేసి నివేదిక అందించాలని కోరారు. కేస్లాపూర్ జాతరకు నిధులు మంజూరుకోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉద్యమాల్లో ఆదివాసీలపై పెట్టిన కేసులు తొలగించే ప్రక్రియకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రి ధనసరి సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆదివాసీ సంఘాల నేతలు ఆత్రం సక్కు, గోడం గణేష్, మేస్రం మనోహర్, మర్స్ కోల తిరుపతి, టేకం భాస్కర్, జుగున్క దేవు సర్మేది, కొడప హన్నుపటేల్, ఆద అమృతరావు, మేస్రం మోతీరాం, ఆత్రం సుగుణ, ప్రొ. గుమ్మడి అనురాధ, ప్రొ. అప్క నాగేశ్వరరావు, ప్రొ. రేగ రాజేందర్, ప్రొ. సిదం కిశోర్, సిదం జగ్ను, ఆత్రం లక్ష్మణ్, సోయం భీంరావు, సిదం అర్జు, బుర్సా పోచయ్య, మేస్రం గంగారాంతో పాటు పలువురు ప్రతినిధులు హాజరయ్యారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

అధికారులా… ? ఏమీ చేయలేని అసహాయులా…?

Divitimedia

తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్ పర్సన్ గా వెన్నెల

Divitimedia

దామరతోగులో పోలీసుల కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్

Divitimedia

Leave a Comment