పాల్వంచ ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలు భేష్
ప్రశంసించిన జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (డిసెంబరు 11)
భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచలోని ప్రభుత్వాసుపత్రిలో గతంతో పోలిస్తే వైద్యసేవలు మరింత మెరుగయ్యాయని, జాతీయస్థాయి NQAS సర్టిఫికేషన్ రావడమే ఉదాహరణ అని జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ పేర్కొన్నారు. ఆసుపత్రిలో సేవలు మెరుగుపడటానికి కృషిచేసిన డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాంప్రసాద్, వైద్య సిబ్బందిని బుధవారం ఆయన అభినందించారు. గత నెలలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగి 100 వరకు చేరుకోవడం, ఖరీదైన, సంక్లిష్టమైన మోకాళ్ళ కీళ్లమార్పిడి శస్త్రచికిత్స నిర్వహించడం, రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్న 60 ఏళ్ల మహిళకు పాల్వంచ ప్రభుత్వాసుపత్రిలో శస్త్రచికిత్స నిర్వహించడం పట్ల జిల్లా కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు విశేష కృషిచేసిన ప్రసూతి వైద్యురాలు డాక్టర్ సరళ, డాక్టర్ సోమరాజుదొర, డాక్టర్ శైలేష్ కుమార్ లను ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పటికే రూ.78లక్షలు ఎమ్మెల్యే, డీఎంఎఫ్టీ నిధులతో ఆసుపత్రికి కావలసిన సామాగ్రి కొనుగోలు చేసేందుకు టెండర్లు పిలవగా, ఆసుపత్రిలో మహిళాశక్తి క్యాంటీన్, ఓపెన్ జిమ్ త్వరలో ఏర్పాటు కానున్నాయని తెలిపారు. ప్రజలకు అన్ని రకాల వైద్యసదుపాయాలు అందించడంలో ఎటువంటి సహాయం కావాలన్నా తానున్నానంటూ కలెక్టర్ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా మెరుగైన వైద్యసేవలందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాంప్రసాద్, ఆర్ఎంఓ డాక్టర్ సోమరాజుదొర, నర్సింగ్ సూపరింటెండెంట్ లక్ష్మి, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.