పిల్లల్లోని సృజనాత్మకత వెలికి తీయాలి :
బాలల దినోత్సవాల్లో జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (నవంబరు 14)
పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ అన్నారు. గురువారం ఐడిఓసి సమావేశమందిరంలో మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మిషన్ వాత్సల్య పథకం, బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వేడుకలలో జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా జ్యోతిప్రజ్వలన చేసిన జిల్లా కలెక్టర్, దివంగత జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జి.వి.పాటిల్ మాట్లాడుతూ, బాలలదినోత్సవం ప్రాముఖ్యత గురించి వివరించారు. పిల్లలకు ప్రేమ, గౌరవం, భవిష్యత్తులో ఎదగడానికి అవకాశాలు ఇవ్వాలని, వారి కలలు నిజం చేసేందుకు పెద్దలు సాయంచేయాలని సూచించారు. పిల్లలు వేరే వారితో పోల్చుకోకూడదని, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యముంటుందని, వాటిని గుర్తించి ఆయారంగాల్లో అభివృద్ధి చెందటానికి తగిన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. జిల్లాలో ఎంతో నైపుణ్యం కలిగిన పిల్లలున్నారని, ఇటీవల ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ నిర్వహించిన ఆటలపోటీల్లో ఛాంపియన్ షిప్ ట్రోఫీ గెలుచుకున్న భద్రాచలం ఐటీడీఏ పిల్లలు తనకు స్పూర్తిదాయకమని కలెక్టర్ ప్రశంసించారు. ఈ సందర్భంగా కలెక్టర్, తన బాల్యంలో బాలల దినోత్సవ వేడుకల అనుభవాలు విద్యార్థులతో పంచుకున్నారు. పిల్లలు స్వతంత్రంగా జీవించే విధంగా అందరూ చర్యలు చేపట్టాలని తెలిపారు. పెద్ద కోచింగ్ సెంటర్లలో చదివితేనే విజయం సాధిస్తామనేది అపోహ మాత్రమేనని, దానికి తానే ఉదాహరణగా జిల్లాకలెక్టర్ తెలిపారు. మనకున్న సౌకర్యారాలను అందిపుచ్చుకొని విజయాలు సాధించాలన్నారు.ప్రస్తుతం జరుగుతున్న గ్రంథాలయ వారోత్సవాలలో నెహ్రూ తన కూతురికి రాసిన లేఖలను చదవడం ద్వారా వారికి దేశం మీద ఉన్న అభిమానం, దేశభక్తి మనకు తెలుస్తుందన్నారు. ఒకప్పుడు వచ్చిన చందమామ కథలు, చంపక్ కథలు వంటి పుస్తకాలు ఇప్పుడు మనకు ఎక్కడా దొరకటం లేదని, విద్యార్థినీ,విద్యార్థులు గ్రంథాలయాలకు వెళ్లి మంచి పుస్తకాలను చదవటం ద్వారా మంచి జ్ఞానాన్ని పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులచేత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఐటీడీఏ మనోవికాస్ పాఠశాల దివ్యాంగ విద్యార్థినులు ప్రదర్శించిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది. ఈ వేడుకల్లో భాగంగా జిల్లాలో వివిధ రంగాల్లో ప్రావీణ్యం సాధించిన విద్యార్థులకు కలెక్టర్ ప్రశంసాపత్రాలు, పుస్తకాలు, బహుమతులు అందజేశారు. కుసుమకుమారి అనే విద్యార్థినికి బీఎస్సీ నర్సింగ్ చేయడానికి గాను ఎన్నారై తోటకూర రమేష్ చేసిన ఆర్థికసహాయం రూ.1 లక్ష చెక్కురూపంలో జిల్లా కలెక్టర్ ద్వారా అందించారు. ఈ సందర్భంగా ‘ది ఇన్నర్ వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్’ పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో స్థానికసంస్థల జిల్లా అదనపు కలెక్టర్ విద్యాచందన, జిల్లా సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లెనినా, సిడబ్ల్యూసి చైర్ పర్సన్ భారతరాణి, సభ్యులు సుమిత్రాదేవి, షాదిక్ పాషా, అంబేద్కర్, విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.