Divitimedia
Bhadradri KothagudemEducationLife StyleSpot NewsTechnologyTelanganaYouth

గ్రూప్ 3 పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

గ్రూప్ 3 పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

పరీక్షల విధులపై దిశానిర్దేశం చేసిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (నవంబరు 13)

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే గ్రూప్‌–3 పరీక్షను పకడ్బందీగా, ఎలాంటి సమస్యలకు అవకాశం లేకుండా నిర్వహించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ తెలిపారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలోని సమావేశమందిరంలో వివిధ శాఖల అధికారులతో ఈనెల 17, 18 తేదీలలో జరుగనున్న గ్రూప్‌3 పరీక్ష నిర్వహణపై సమీక్షించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లా లో 39 కేంద్రాలలో 13478 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్లు 39 మంది, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ 39, ఫ్లయింగ్ స్క్వాడ్ 12,అభ్యర్థులను గుర్తించే 148మంది అధికారులు, రూట్ ఆఫీసర్లు 12, అబ్జర్వర్లు 40 మందితోపాటు రాష్ట్ర స్థాయి నుంచి కూడా అబ్జర్వర్లు విధులు నిర్వహిస్తారని తెలిపారు. ఆయా పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేపట్టాలని, ప్రతీ కేంద్రంలో సి.సి.కెమరాలు ఏర్పాటు చేయాలని, ఆయా కేంద్రాల్లో ఎవరిని అనుమతించకూడదని తెలిపారు. అన్ని కేంద్రాలను పోలీసు అధికారులు ముందస్తుగా స్క్రీనింగ్‌ చేయాలని తెలిపారు. కేంద్రానికి ప్రహారీ గోడ లేనట్లయితే అదనంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రతీ కేంద్రం వద్ద అవసరమైన బందోబస్తు ఏర్పాటుతోపాటు బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ తీసుకోవాలని తెలిపారు. అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతించే ముందు వారిని క్షుణ్ణంగా పరిశీలించి పంపించాలని, మగ, ఆడ అభ్యర్థులను విడివిడిగా తనిఖీ చేయాలన్నారు. ప్రతికేంద్రంలో సి.సి.కెమెరాలు, ఫర్నిచర్‌, త్రాగునీరు, మరుగుదొడ్లు, మెడికల్‌ టీమ్‌ ఉండేవిధంగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. కేంద్రాల్లో అవసరమైన ఇన్విజిలేటర్లను నియమించుకోవాలని తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు సమయానుకూలంగా పరీక్షకు ముందు, పరీక్ష అనంతరం ఆర్టీసీ బస్సులు నడిపించాలని ఆర్టీసీ డిపోమేనేజర్‌ ను ఆదేశించారు. పరీక్ష సమయంలో విద్యుత్తు సరఫరాలో ఏ అంతరాయం కలుగకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. ప్రతీ సెంటర్లో ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ తో పాటు ఏఎన్‌ఎంలను నియమించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని ఆదేశించారు. అభ్యర్థులు టిజిపిఎస్‌సి పోర్టల్‌ నుంచి హాల్‌ టికెట్‌ డౌన్‌ లోడ్‌ చేసుకోవాలని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో శానిటేషన్‌ నిర్వహించాలని మున్సిపల్‌ కమీషనర్‌ను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి పోస్టర్లు, హోర్డింగ్స్‌, ప్రచార సామాగ్రి తొలగించాలని తెలిపారు. పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్‌ కేంద్రాలను పరీక్షల సమయంలో మూసివేయించాలని పోలీసు అధికారులకు సూచించారు. పరీక్ష హాలులోకి ఎవరినీ సెల్‌ ఫోన్‌ తో అనుమతించబోమని, కేవలం చీఫ్‌ సూపరింటెండెంట్లను మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు. బయటి వ్యక్తులను, మీడియాను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించకూడదని తెలిపారు. పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్ష సమయానికి అరగంట ముందే హాజరవ్వాలని, సెల్‌ ఫోన్‌, క్యాలికులేటర్‌, ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌, గాడ్జెట్స్ పరీక్షహాలులోకి అనుమతించబోమని అదనపు కలెక్టర్‌ స్పష్టం చేశారు. పరీక్షలను ఎలాంటి మాల్‌ ప్రాక్టీసుకు తావివ్వకుండా ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. ఈ సమీక్ష సమావేశం అనంతరం పరీక్షల నిర్వహణలో విధులు నిర్వర్తించే అధికారులకు, అబ్జర్వర్లకు తీసుకోవలసిన జాగ్రత్తలు, చేపట్టవలసిన చర్యలపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, గ్రూప్ 3 పరీక్షల కోఆర్డినేటర్ హరికృష్ణ, జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Related posts

పదకొండుమంది సీడీపీఓలకు అసిస్టెంట్ డైరెక్టర్లుగా ప్రమోషన్స్

Divitimedia

అలెర్ట్… అలెర్ట్… కొత్తగూడెంలో ఆదివారం ట్రాఫిక్ మళ్లింపు

Divitimedia

ప్రగతి విద్యానికేతన్ లో ఉత్సాహంగా బతుకమ్మ వేడుకలు

Divitimedia

Leave a Comment