గోదావరిలో గణేష్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ చర్యలు
జిల్లావ్యాప్తంగా 1537 గణేశ్ విగ్రహాలకు పూజలు
నిమజ్జోత్సవం జరిగే ప్రదేశాలు పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు
✍️ భద్రాచలం – దివిటీ (సెప్టెంబరు 14)
గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ముగించుకుని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలం వద్ద గోదావరినదిలో నిమజ్జనంకోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలియజేశారు. భద్రాచలంలో గణేశ్ నిమజ్జనం జరిగే ప్రదేశాలను జిల్లా ఎస్పీ శనివారం సందర్శించారు. నిమజ్జన సమయంలో ఉత్సవకమిటీల సభ్యులు పోలీసు వారి సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసుల సూచనలకు అనుగుణంగా నిర్వాహకులు, ఉత్సవకమిటీ సభ్యులు నడుచుకుని ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమం పూర్తి అయ్యేలా సహాయ సహకారాలందించాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో గణేశ్ నిమజ్జన ఊరేగింపులు నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. నిమజ్జన సందర్భంగా ఊరేగింపు సమయంలో డీజేలు, బాణాసంచా కాల్చడం వంటివి నిషేధమని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఉత్సవ కమిటీల సభ్యులు బాధ్యతగా నియమ నిబంధనలను పాటిస్తూ, పోలీసు వారి సూచనలు పాటించాలని ఎస్పీ కోరారు. చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భక్తిశ్రద్ధలతో నవరాత్రులను ముగించుకుని ఆఖరున జరిగే నిమజ్జన కార్యక్రమాన్ని కూడా మతసామరస్యం,శాంతియుత వాతావరణంలో జరిగేలా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఏర్పాటుచేసిన మొత్తం 1537 విగ్రహాలతోపాటు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మొత్తంలో భద్రాచలానికి నిమజ్జనానికి వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టినట్లు తెలియజేశారు.