సీతారామ ప్రాజెక్టు నీరు ఈ ప్రాంతానికి కూడా ఇవ్వాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య డిమాండ్
✍️ బూర్గంపాడు – దివిటీ (ఆగస్టు 14)
పినపాక నియోజకవర్గం పరిధిలోని అశ్వాపురం మండలంలో నిర్మించిన సీతారామ ప్రాజెక్టు నుంచి బూర్గంపాడు మండలానికి కూడా వెంటనే ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య డిమాండ్ చేశారు. సారపాక సీపీఎం కార్యాలయంలో బుధవారం జరిగిన పార్టీ బూర్గంపాడు మండల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
సీతారామ ప్రాజెక్టు నీరు బీజీకొత్తూరు వద్దనున్న తుమ్మలచెరువు ప్రాజెక్టు, బూర్గంపాడు మండలంలో టేకులచెరువు గ్రామంలోని చెరువుకు ఇవ్వాలని, రైతు పొలాలకు వేల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించవచ్చన్నారు. ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు నీరు ఈ ప్రాంతంలో ఇవ్వకుండా డైరెక్టుగా తీసుకెళ్లాలని చూస్తున్నారని ఆరోపించారు. రైతులకు సాగునీరు, తాగునీరు ఇవ్వకుండా తీసుకెళ్తే చూస్తూ ఊరుకునేది లేదని, ఈ ప్రాంతంలోని రైతుల తరఫున పెద్దఎత్తున పోరాటానికి ముందుంటామన్నారు. రైతుల పక్షాన పోరాటాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎంబీ నర్సారెడ్డి,మండల కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు, పాండవుల రామనాథం, భయ్యా రాము, పాపినేని సరోజిని, అబీద, గుంటక కృష్ణ, కనకం వెంకటేశ్వర్లు, కందుకూరి నాగేశ్వరరావు,
రాయల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.