స్థానిక సంస్థల ఎన్నికలకోసం సస్పెక్ట్, రౌడీషీటర్స్ కు కౌన్సెలింగ్
సత్ప్రవర్తనతో మెలగాలన్న డీఎస్పీ రెహమాన్
✍️ కొత్తగూడెం – దివిటీ (ఆగస్టు 8)
మరికొన్ని రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగ బోతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయఘటనలు చోటుచేసుకోకుండా శాంతియుత వాతావరణంలో ఆ ప్రక్రియ నిర్వహించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు ఇప్పట్నుంచే చర్యలు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలమేరకు కొత్తగూడెం డీఎస్పి అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సస్పెక్ట్ షీటర్స్, రౌడీషీటర్స్ కు గురువారం కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా డీఎస్పీ మాట్లాడుతూ, రౌడీషీటర్స్,సస్పెక్ట్స్ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు తమ దృష్టికి వచ్చినా వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బందులు, ప్రజల శాంతికి భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదని తెలిపారు. ఇప్పటికీ ప్రవర్తన మార్చుకోకుండా ఎవరైనా శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉన్నతాధికారుల ఆదేశాలతో పీడీయాక్ట్ కేసులు నమోదు చేస్తామన్నారు. నియమ నిబంధనలు పాటిస్తూ, సత్ప్రవర్తనతో మెలుగుతున్నవారిపై షీట్స్ తొలగించేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా డీఎస్పీ తెలియజేశారు. కార్యక్రమంలో కొత్తగూడెం టూటౌన్ సీఐ రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.