‘సమస్యలతో వచ్చే బాధితులకు భరోసా కల్పించాలి’
పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్ సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
✍️ పాల్వంచ – దివిటీ (జులై 26)
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శుక్రవారం పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్ సందర్శించి, తనిఖీ చేశారు. ఆయనకు టీఎస్ఎస్పీ సిబ్బంది గౌరవవందనం సమర్పించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ రికార్డులు పరిశీలించి, ఎస్పీ పలు కేసుల వివరాలడిగి తెలుసుకున్నారు. ఆ స్టేషన్ అధికారులు, సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు. డయల్-100 ఫోన్ రాగానే స్పందించి ఘటనాస్థలానికి చేరుకుని బాధితులకు న్యాయం చేకూర్చాలన్నారు. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తూ, నివారణా చర్యలు చేపట్టాలని తెలిపారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలందరినీ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మావోయిస్టుల కదలికలపైనా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్బంగా అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం కృషిచేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, ఎస్బీ ఇన్స్పెక్టర్ నాగరాజు, ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
———————
గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి : ఎస్పీ రోహిత్
———————
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను ‘గంజాయి రహిత జిల్లా’గా మార్చేందుకు పోలీస్ శాఖతోపాటు జిల్లా ప్రజలు కూడా సమాచారమందిస్తూ భాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ రోహిత్ రాజు శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలో ఎవరైనా వ్యక్తులు నిషేధిత గంజాయి రవాణా చేస్తున్నట్లు గానీ, విక్రయిస్తున్నట్లు గానీ, సేవిస్తున్నట్లు గానీ తెలిస్తే వెంటనే సమాచారం పోలీసులకు తెలియ జేసి, జిల్లాలో గంజాయి సమూలంగా నిర్మూలించేలాగా సహకరించి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు. గంజాయిలాంటి మత్తుపదార్థాలకు యువత బానిసలై, తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అలవాటుగా యువకులు గంజాయి సేవించే ప్రదేశాలను గుర్తించినట్లు తెలిపిన ఎస్పీ, ఆ ప్రదేశాల్లో గంజాయి సేవిస్తూ ఎవరైనా కనపడితే కేసులు నమోదు చేసి, కఠినచర్యలు తీసుకుంటామని తెలియజేశారు. నిషేధిత గంజాయి రవాణా, విక్రయం, వినియోగాలకు సంబంధించి సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. జిల్లాలో గంజాయి నిరోధం కోసం ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రోహిత్ రాజు ఈ సందర్బంగా వెల్లడించారు. ఎవరైనా గంజాయి గురించిన సమాచారం 8712682133,
8712682135 నెంబర్లకు తెలియజేయాలని ఆయన కోరారు.