సందిగ్ధావస్థలో ‘డీడబ్ల్యుఓ’ బాధ్యతలు… మార్పుపై చర్చ…
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జులై 20)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంక్షేమాధికారి (డీడబ్ల్యుఓ) పోస్ట్ సందిగ్ధంలో పడినట్లయింది. ప్రస్తుతం ఆ స్థానంలో అదనపు బాధ్యతలతో కొనసాగుతున్న వేల్పుల విజేత మాతృశాఖ పోస్టు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి పోస్ట్ నుంచి రిలీవ్ కావడంతో ఖమ్మం జిల్లాలో అధికారిగా ఉన్న ఆమెను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వేరే శాఖలో అదనపు బాధ్యతలతో కొనసాగిస్తారా? లేదా? అనే అనుమానాలు అధికారుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వర్తించిన వేల్పుల విజేతకు, గత జిల్లా కలెక్టర్ ప్రియాంకఅల జిల్లా సంక్షేమ అధికారి(డీడబ్ల్యుఓ) గా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. గతంలో నిత్యం వివాదాలమయంగా ఉంటున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐసీడీఎస్ పనితీరును గాడిన పెట్టేందుకు చేసిన ఆ ప్రయత్నం కాస్త సత్ఫలితాలనిచ్చినట్లే చెప్పవచ్చు. ‘డీడబ్ల్యుఓ’ గా విజేత బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జిల్లాలో ఐసీడీఎస్ లో వివాదాలు దాదాపు లేకుండా పోయాయి. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఖమ్మం, ప్రభుత్వ ఐటీఐలో సూపరింటెండెంట్ గా తన అసలు పోస్టులో ఉన్న ఆమె ఖమ్మం మహిళా ప్రాంగణం అధికారిగా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎంప్లాయిమెంట్ అధికారి పోస్టు ఖాళీగా ఉండటంతో ఆ పోస్టులో అదనపు బాధ్యతలు కూడా విజేతకు అప్పగించారు. ఆ బాధ్యత చూస్తున్న ఆమెకు, అప్పటి జిల్లాకలెక్టర్ ప్రియాంకఅల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంక్షేమాధికారి బాధ్యతలను కూడా అప్పగించారు. ఈ పరిస్థితుల్లో తాజా బదిలీల్లో జిల్లాకు రెగ్యులర్ ఎంప్లాయిమెంట్ అధికారి రావడంతో విజేత ఆ బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో సంబంధం లేదనే కారణంతో విజేతను ‘డీడబ్ల్యుఓ’గా కొనసాగించడంలో సాంకేతికపరమైన సమస్యలున్నాయనే వాదనను కొందరు తెరపైకి తెస్తున్నారు. ఇప్పటి వరకు డీడబ్ల్యుఓ బాధ్యతలు చూస్తున్న విజేతను ఆ బాధ్యతల్లో కొనసాగించడం కష్టమనే వాదన మహిళా, శిశు సంక్షేమశాఖలో వినిపిస్తోంది. ఐసీడీఎస్ లో అత్యంత వివాదాస్పద జిల్లాల్లో ఒకటిగా పేరున్న భద్రాద్రి కొత్తగూడెంలో అధికారిని మార్చితే పరిస్థితులు మళ్లీ మొదటికి వస్తాయని, అందువల్ల మరికొంతకాలం డీడబ్ల్యుఓగా విజేతను కొనసాగించే ఆలోచనలో ఉన్నతాధికారులున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మధ్య రాష్ట్రంలో అన్ని ప్రభుత్వశాఖల్లో బదిలీల ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ‘రెగ్యులర్ డీడబ్ల్యుఓ’ గా ఎవరో ఒకరిని బదిలీపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నియమించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తీవ్ర పోటీ ఉన్న ఈ జిల్లా సంక్షేమాధికారి పోస్ట్ విషయంలో తాజా పరిణామాలు చర్చకు దారితీస్తున్నాయి.