వలస ఆదివాసీలకు ప్రత్యేక చికిత్సలు
చిరుతానుపాడులో ప్రత్యేక వైద్యశిబిరం
✍️ పాల్వంచ – దివిటీ (జులై 17)
పాల్వంచ డివిజన్లోని ఉల్వనూరు గ్రామపంచాయతీ పరిధిలోని చిరుతానుపాడు మారుమూల వలస ఆదివాసీగ్రామంలో బుధవారం భద్రాచలం ఐటీడీఏ పీఓ ఆదేశాల మేరకు ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించారు. ఆ గ్రామంలో అందరూ వ్యాధుల బారిన పడినట్లు పీఓ దృష్టికి రావడంతో డీఎంహెచ్ఓతో మాట్లాడిన ఆయన ప్రత్యేక వైద్యబృందాన్ని పంపించి వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ఆ గ్రామంలోని గిరిజనులందరికి వైద్యపరీక్షలు నిర్వహించి, మందులు అందించినట్లు డీఎంహెచ్ఓ డా.భాస్కర్ పేర్కొన్నారు. వర్షాకాలం ఆరంభమై ఇళ్లలో పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో, కొందరికి వైరల్ జ్వరాలు సోకాయని, చిన్నపిల్లలకు సరైన ఆహారమూ అందకపోవడం వల్ల రక్తహీనతతో బాధపడుతున్నారని ఆయన వెల్లడించారు. చిన్నపిల్లలకు ఎలాంటి ఆహారం అందించాలో ఆ కుటుంబసభ్యులకు తెలియజేశామని ఆయనన్నారు. పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి ముందు, వెనక డ్రైనేజీలో మురికినీరు లేకుండా జాగ్రత్త వహించాలని ప్రజలకు తెలియజేశామన్నారు. బాహ్య ప్రపంచానికి దట్టమైన అటవీప్రాంతంలో ఉన్న ఆ గ్రామానికి సరైన రోడ్డుసౌకర్యం కూడా లేకపోవడంతో ఎవరికైనా జ్వరాలు సోకినా, అస్వస్థతకు గురైనప్పుడు దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి రాకుండా నాటు వైద్యం మీద ఆధారపడుతున్నారని తెలిపారు. వారికి వచ్చిన జ్వరం, రుగ్మతలు తగ్గడం లేదన్నారు. ప్రస్తుతం డాక్టర్లందరూ ఇంటింటికీ తిరిగి అందరికీ వైద్య పరీక్షలు చేసి మందులిచ్చామని, ఇకముందు గ్రామంపై ప్రత్యేక శ్రద్ధ చూపి తప్పనిసరిగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఆ గిరిజనులందరూ ఆరోగ్యవంతులుగా ఉండేలా చూస్తామన్నారు. ఆ గ్రామంలో సేవలందించినవారిలో డాక్టర్లు తేజశ్రీ, రాజు, ప్రతాప్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.