ఆస్పిరేషన్ జిల్లాలన్నింటికీ భద్రాద్రి ఆదర్శంగా ఉండాలి
సమీక్షలో వ్యవసాయశాఖ జాయింట్ సెక్రటరీ యోగితారాణా
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జులై 11)
కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో ఆస్పిరేషన్ జిల్లాలన్నింటికీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదర్శంగా ఉండాలని వ్యవసాయశాఖ జాయింట్ సెక్రటరీ, కేంద్ర ప్రభారీ అధికారి డాక్టర్ యోగితారాణా కోరారు. ఐడీఓసీ కార్యాలయ సమావేశమందిరంలో గురువారం ఆమె జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యోగితా రాణా మాట్లాడుతూ, జిల్లాతో తనకున్న అనుబంధం గుర్తుచేశారు. జిల్లా అభివృద్ధికి తన పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. జిల్లా అధికారులు అందరూ ప్రత్యేక దృష్టి సారించి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. గుండాల ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సంపూర్ణత అభియాన్ లక్ష్యాలను 100శాతం సాధించాలని తెలిపారు. జాతీయస్థాయిలో జిల్లాకు అవార్డులు సాధించాలని తెలిపారు. వైద్యశాఖ, మహిళా శిశుసంక్షేమశాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి, సరైన పోషకాహారం అందించి పోషకాహారం లోపం నుంచి చిన్నారులను కాపాడాలని కోరారు. దీనికి గాను ఇంటింటి సర్వే నిర్వహించాలని తెలిపారు. జిల్లా పరిధిలో 1.85లక్షలమంది రైతులు 5.56లక్షల ఎకరాల భూమి సాగుచేస్తున్నారని జిల్లా వ్యవసాయ అధికారి వివరించారు. అందరి భూములకు భూసార పరీక్షలు నిర్వహించాలని, కొత్తగూడెంలో భూసార పరీక్షకేంద్రాన్ని త్వరగా అందుబాటులోకి తేవాలని, అప్పటివరకు వ్యవసాయ కళాశాలలోని పరీక్ష కేంద్రం ద్వారా భూసార పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని గ్రంథాలయాల్లో అంధ, మూగ, చెవిటి పిల్లల కోసం ప్రత్యేక ఛాంబర్ ఏర్పాటు చెయ్యాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభారీ కార్యదర్శి పవన్, స్థానికసంస్థల అదనపుకలెక్టర్ విద్యా చందన, కె.వి.కె సైంటిస్ట్ డాక్టర్ ఆర్.శ్రీనివాసరావు, సీపీఓ శ్రీనివాసరావు, వైద్య శాఖాధికారి చంద్రమౌళి, వ్యవసాయశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అర్జునరావు, విద్యాశాఖాధికారి వెంకటేశ్వరచారి, మహిళా, శిశు సంక్షేమాధికారి విజేత, పశుసంవర్ధక శాఖ అధికారి పురందరేశ్వర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబురావు, గుండాల ఎంపీడీవో సత్యనారాయణ, గుండాల ఎంఈఓ, తదితరులు పాల్గొన్నారు.