అడ్డదారిలో బయటపడేందుకు అక్రమార్కుల యత్నం
‘టీజీఈడబ్ల్యుఐడీసీ’లో అక్రమాలకు అంతూపొంతూ లేదా?
ఉన్నతస్థాయిలో పైరవీలు చేస్తున్న అవినీతి’శేషుడు’…
✍️ హైదరాబాదు – దివిటీ (జూన్ 24)
అందినకాడికి ప్రజాధనం ‘బొక్కేసిన’ అక్రమార్కులు, ఆ అవినీతి, అక్రమాల నుంచి బయటపడేందుకు పనులు కూడా పక్కన పెట్టి ఉన్నతస్థాయిలో పైరవీలు చేసుకునే పనిలో తలమునకలైపోయారు. చేసిన అక్రమాలు తమ వెనుకే నీడలా వెంటాడుతుంటే, వాటిని వదిలించుకునే పనే తమకు అధికారిక విధులలాగా హైదరాబాదులోనే మకాంవేశారు. అసలే విధులకు డుమ్మాకొట్టి మరీ తమ సొంత పనులు చేసుకునే ఆ ఉన్నతాధికారి, వెంటాడే గత చరిత్రను రూపుమాపేసి, తన అవినీతిమరకలను కడిగేసుకునే పనిలో ఉన్నారు. టీజీడబ్ల్యుఐడీసీలో ఓ రెండు జిల్లాల బాధ్యతలు చూస్తున్న ఆ ఉన్నతాధికారి, తన ఉద్యోగ జీవితంలో చేసిన అక్రమాలు సశేషంగా తనను వెంటాడకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఆ పనుల కోసం హైదరాబాదులోని తమ కార్యాలయంలో ప్రతిరోజూ రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులను కలుస్తూ, తన ఉద్యోగపరమైన బాధ్యతలను పట్టించుకోవడం లేదు. ఆ అవినీతి అనకొండ గురించి ఇటీవల ”దివిటీ మీడియా”లో ప్రచురితమవుతున్న వరుస కథనాలతో రాష్ట్ర కార్యాలయంలో కదలిక వచ్చింది. తన అక్రమ కార్యకలాపాలపై రాష్ట్ర ఉన్నతాధికారులు విచారణ కొనసాగించకుండా చేసుకునే ప్రయత్నాల వల్ల ఆయన నిర్వర్తించాల్సిన విధులు కూడా నిర్లక్ష్యంగా వదిలేశారు. తెలంగాణలో దాదాపు రూ.100కోట్ల విలువైన కాస్మెటిక్స్, శానిటరీ ప్యాడ్స్ ప్రొక్యూర్ మెంట్ టెండర్లలో అవకతవకలకు పాల్పడిన కీలకమైన ఆ అధికారి మీద విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. 2016 అక్టోబరులో ఓ కాంట్రాక్టర్ దగ్గర రూ.27వేలు లంచం తీసుకుంటూ, ఏసీబీకి పట్టుబడిన ఆ అధికారి, తన పలుకుబడితో ఓ ఉమ్మడి జిల్లా (రెండు జిల్లాల) పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టారు. తనపైనున్న కేసుల విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఆ సంస్థ ఉన్నతాధికారులే ఆయనకు రెండు జిల్లాల బాధ్యతలు కట్టబెట్టడంతో ఆయన తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆయన తన ఇంటి వద్ద నుంచే ఆఫీసు వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. సెలవులే పెట్టకుండా సొంత పనులు చేసుకుంటున్న ఆ అధికారి, అదే సమయంలో అధికారిక పనులు కూడా ఏకకాలంలో చక్కబెడుతున్నట్లు హాజరు వేసుకుంటూ తప్పుడుమార్గంలో అలవెన్సులు ‘డ్రా’ చేసుకుంటున్న దుస్థితి నెలకొంది.
తన కిందిస్థాయి ముఠాను తన పరిధిలోనికే తెచ్చుకునే ప్రయత్నాల్లో ఆ ఈఈ…
రెండు జిల్లాల ఉన్నతాధికారి హోదా కారణంగా ఎదురూ బెదురూ లేని విధంగా అక్రమాలకు పాల్పడుతున్న ఆ అధికారి, గతంలో తన అవినీతిలో సహకరించిన ‘డీఈ’ని తన పరిధిలోనే ప్రస్తుతం ఇన్ చార్జ్ డీఈ గా బాధ్యతల్లో పెట్టుకున్నారు. అది కూడా చాలదన్నట్లుగా ఆ ‘డీఈ’ కి పూర్తిగా ఇక్కడే ‘పోస్టింగ్ కోసం’ చక్రం తిప్పుతున్నాడు. దీనికి మించిన విచిత్రం ఏంటంటే ఆ ‘అవినీతిపరుడైన’ ఈఈ పరిధిలోనే ఆ డీఈ తోపాటు, ఆ డీఈకి తోడల్లుడైన ఏఈ విధులు నిర్వర్తిస్తుండటం. అక్రమార్కులైన ఈ అధికారులంతా కలిసి, ఆ ఏఈ సోదరుడిని ‘కాంట్రాక్టర్’గా రంగంలోకి దించి పనులు కట్టబెడుతుండటం విశేషం. ఈ ముఠా తమకు అడ్డం వచ్చి పనుల కోసం ‘టెండరు వేస్తున్న’ ఓ కాంట్రాక్టర్ ను కీలకమైన ఓ మంత్రి పేరు చెప్పి మరీ బెదిరించి అడ్డు తొలగించుకున్నారనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా, ఈ వ్యవహారాలపైన కఠినంగా వ్యవహరించబోయిన టీజీఈడబ్ల్యుఐడీసీ రాష్ట్ర ఉన్నతాధికారి ఒకరిని కూడా ఈ అధికారుల ముఠా ‘బుట్టలో వేసుకున్నట్లు’ విశ్వసనీయ సమాచారం. దురదృష్టవశాత్తూ ఆయన ఇటీవల బదిలీ కావడంతో, తాజాగా బాధ్యతలు చేపట్టిన మరో ఉన్నతాధికారిని ‘మేనేజ్ చేసుకునే’ ప్రయత్నాల్లో ఈ అధికారుల ముఠా పనులన్నీ పక్కన పెట్టి మరీ ప్రయత్నిస్తోందని విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికైనా టీజీఈడబ్ల్యుఐడీసీ ఉన్నతాధికారులు ఈ వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరించి, ఇంతటి తీవ్రమైన ఆరోపణలు, విచారణలు ఎదుర్కొంటున్న అధికారుల మీద పక్కాగా విచారణ జరిపి, వారిపై కఠినచర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.